
రక్షణ రంగంలో భారత్ తన సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. అగ్రదేశాలకు సైతం షాక్ ఇస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంఖ్య రూ. 1 లక్ష 50 వేల 590 కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది కంటే దాదాపు 18శాతం ఎక్కువ. గతేడాది ఇది 1.27 లక్ష కోట్లుగా ఉంది. 2019-20తో పోలిస్తే 90శాతం భారీ పెరుగుదల అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ పీఎస్‌యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల కృషిని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ రక్షణ రంగం నిరంతరం బలపడుతుందనడానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ రంగంలో సమిష్టి కృషిని రాజ్‌నాథ్ ప్రశంసించారు. దీనిని చారిత్రక విజయంగా అభివర్ణించారు. రక్షణ ఉత్పత్తి రంగంలో పెరుగుతున్న పురోగతి దేశం యొక్క రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుందని రాజ్ నాథ్ అన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందని రాజ్‌నాథ్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1,50,590 కోట్లకు పెరిగిందని ఆయన అన్నారు. ఇందులో ప్రభుత్వ రంగం, DPSUల సహకారం 77శాతం ఉండగా.. ప్రైవేట్ రంగం సహకారం 23శాతంగా ఉంది. విధాన సంస్కరణలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం, మేకిన్ ఇండియాపై ప్రాధాన్యత ఈ వృద్ధిని వేగవంతం చేశాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈ ఏడాది DPSUల ఉత్పత్తి 16శాతం, ప్రైవేట్ రంగం ఉత్పత్తి 28శాతం పెరిగింది.
రక్షణ ఎగుమతులు రూ. 23,622 కోట్లతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గతేడాది కంటే రూ. 2,539 కోట్లు ఎక్కువ. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశ అవసరాలను తీర్చగల రక్షణ పరిశ్రమను సృష్టించడం, ప్రపంచంలో మెరుగైన స్థానాన్ని సంపాదించుకోవడం ప్రభుత్వ లక్ష్యం.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తి గరిష్ట స్థాయి రూ.1,50,590 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం పెరుగుదలను చూపిస్తుంది. 2019-20 సంవత్సరంలో ఈ సంఖ్య రూ.79,071 కోట్లు, అంటే 5 ఏళ్లలో 90 శాతం పెరుగుదల ఉండడం గొప్ప విషయం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..