మేలు మరిచి విషం చిమ్మింది.. భారతీయుల దెబ్బకు టర్కీ, అజర్‌బైజాన్‌ విలవిల!

"చెరపకురా చెడేవు.." అంటారు మన పెద్దలు. ఇప్పుడు ఇదే సామెతను టర్కీస్‌లో గుర్తు చేసుకుంటోంది ఆ దేశం. భారతదేశంపై దాడికి పాకిస్తాన్‌కు ఆయుధాలు అందించిన టర్కీని.. కోలుకోలేని దెబ్బతిస్తున్నారు భారతీయులు. బాయ్‌కాట్‌ టర్కీ అంటూ టూరిజంతోపాటు వస్తువులను కూడా బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల బాయ్‌కాట్‌ నిర్ణయం పిడుగులా మారింది.

మేలు మరిచి విషం చిమ్మింది.. భారతీయుల దెబ్బకు టర్కీ, అజర్‌బైజాన్‌ విలవిల!
Boycott Turkey

Updated on: May 14, 2025 | 7:47 AM

“చెరపకురా చెడేవు..” అంటారు మన పెద్దలు. ఇప్పుడు ఇదే సామెతను టర్కీస్‌లో గుర్తు చేసుకుంటోంది ఆ దేశం. భారతదేశంపై దాడికి పాకిస్తాన్‌కు ఆయుధాలు అందించిన టర్కీని.. కోలుకోలేని దెబ్బతిస్తున్నారు భారతీయులు. బాయ్‌కాట్‌ టర్కీ అంటూ టూరిజంతోపాటు వస్తువులను కూడా బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల బాయ్‌కాట్‌ నిర్ణయం పిడుగులా మారింది.

అపకారికి సైతం ఉపకారం చేయడం భారత్‌ నైజం. కానీ ఆపదలో ఆదుకున్న ఉపకారికి కూడా అపకారం తలపెట్టి తన బుద్దిని చాటుకుంది టర్కీ. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది భారత్‌. దీంతో పాక్‌కు అనుకూలంగా వ్యవహరించిన టర్కీ.. మనదేశంపై దాడి చేసేందుకు క్షిపణులు, డ్రోన్లను సరఫరా చేసింది. ఆ డ్రోన్లతోనే భారత భూభాగంపై దాడి చేసింది పాకిస్తాన్‌. 2023లో టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు అన్ని దేశాల కంటే ముందు ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో ఆదుకుంది భారత ప్రభుత్వం. ఆ మేలును మరిచిపోయిన టర్కీ.. భారత్‌పైనే విషం చిమ్మింది. దీంతో ఎర్డోగాన్‌ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు..భారతీయులు.

టర్కీ చేసిన ద్రోహంతో రగిలిపోతున్న భారతీయులు బాయ్‌కాట్‌టర్కీ పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. #BoycattTurkey అంటూ ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను నిరాకరిస్తున్నారు. టర్కీ పర్యాటకంతో పాటు టర్కీ ఎయిర్ లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతు ఇస్తుందని.. అందుకే ఈ బాయ్ కాట్ టర్కీ ఉద్యమం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టర్కీతో పాటు పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన అజర్‌బైజాన్‌కు కూడా భారతీయులు షాక్‌ ఇస్తున్నారు. ఆ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతే కాకుండా అత్యవసరం అయితే తప్ప ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి.

ప్రముఖ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ ‘కాక్స్ అండ్ కింగ్స్’.. టర్కీ, అజర్‌బైజాన్‌లకు కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్‌ మై ట్రిప్ కూడా అత్యవసర పరిస్థితులుంటే తప్ప టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించవద్దని కోరింది. ట్రావోమింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ కూడా టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. గోవాలో టర్కీష్ పౌరులకు ఎలాంటి వసతి సేవలను అందించకూడదని తాము నిర్ణయించుకున్నట్లు గోవా విల్లాస్ సంస్థ వెల్లడించింది. టర్కీష్ ఎయిర్ లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించినట్లు గో హోమ్‌ స్టేస్ సంస్థ ప్రకటించింది. పర్యాటకంపై ఆధారపడ్డ ఆ దేశాలపై ఈ నిర్ణయం భారీగా ప్రభావం చూపుతోంది.

పుణేలోని వ్యాపారులు సైతం టర్కీ యాపిల్స్‌ను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక మార్కెట్‌లో టర్కీ యాపిల్స్‌ కనిపించకుండా పోయాయి. పుణే మార్కెట్‌లో టర్కీ యాపిల్స్ సీజన్ టర్నోవర్ రూ.1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అయినప్పటికీ వర్తకులు దీన్ని కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా, ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో టర్కీ మార్బుల్, కార్పెట్స్, డిజైనర్‌ వేర్స్‌, ఫర్నిచర్‌, లైట్స్‌కు కూడా భారత్‌లో డిమాండ్‌ పెరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వాటి వ్యాపారంపై కూడా ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి..భారతీయుల నిర్ణయం పిడుగులా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..