రైలు ప్రమాదాలకు పాకిస్తాన్ ISI కుట్ర..? రెండు రోజుల్లో మూడు ఘటనలు

పట్టాలపై కుట్ర..! కృత్రిమంగా రైలు ప్రమాదాల్ని సృష్టించే పన్నాగం..! ఆవారాగాళ్ల పనేనా.. లేక దీని వెనుక అరాచక శక్తుల ప్రమేయం ఉందా..? ఉత్తర భారతదేశంలో వరుస ఘటనలు... దేనికి సంకేతం? రైళ్లను పడగొట్టి.. ప్రాణనష్టానికి తావిచ్చి.. మోదీ సర్కార్ ప్రతిష్టను భ్రష్టుపట్టించే కుయుక్తులు ఎవరి పని..? ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ హస్తం ఉందా..? తేల్చే పనిలో పడింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. గతంలో కూడా ఘోర రైలు ప్రమాదాల్లో ఐఎస్‌ఐ ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు మళ్లీ అదే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

రైలు ప్రమాదాలకు పాకిస్తాన్ ISI కుట్ర..?  రెండు రోజుల్లో మూడు ఘటనలు
Train Accidents
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2024 | 8:23 AM

రైలు పట్టాలపై అడ్డంగా పెద్దపెద్ద బండరాళ్లు.. సిమెంటు దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు.. ఇదొక వికృత క్రీడ.. పైశాచిక చర్య. సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోతే.. ఆ దారిలో వెళ్లే రైళ్లు గాడి తప్పితే.. అంతే సంగతులు. ఘోర ప్రమాదం.. ఊహకందనంత ప్రాణనష్టం. ట్రెయిన్ యాక్సిడెంట్లను సృష్టించే కుట్ర ఏదైనా జరుగుతోందా… అనే సందేహం కేంద్ర ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ విధంగా.. మోదీ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేసే అవసరం ఎవరికి ఉంది? అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు.

కాన్పూర్‌ సమీపంలో బర్రారాజ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌..! ఆ మార్గంలో వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. ఎల్పీజీ సిలిండర్ రైల్వే ట్రాక్ పైనే ఉంచినట్లు, ఆ పక్కనే పెట్రోల్, అగ్గిపెట్టె, ఇతర సున్నితమైన వస్తువులు కూడా ఉన్నట్టు గ్రహించారు. ట్రాక్‌ను పరిశీలించి రైలును ముందుకు పంపారు. ప్రయాగరాజ్‌ నుంచి హర్యానాలోని భివానీ వెళ్లాల్సిన కాళింది ఎక్స్‌ప్రెస్‌ ఒక ఘోర ప్రమాదం నుంచి ఆ విధంగా ఎస్కేపైంది.

కాన్సూర్ ఘటన మర్చిపోకముందే.. మరుసటిరోజే అటువంటిదే మరో షాక్. రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో రైలు పట్టాలపై 70 కిలోల బరువుండే రెండు సిమెంటు దిమ్మెల్ని ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ మార్గంలో వెళ్లిన గూడ్స్‌ రైలు.. ఈ దిమ్మెల్ని ఢీకొట్టి.. ఎటువంటి డ్యామేజీ లేకుండా ముందుకెళ్లింది. రైల్వే చట్టాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు.

కాన్పూర్‌ ఘటనపై కూడా కేసు నమోదు చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తోంది NIA. దీన్ని రైలు పేల్చివేతకు జరిగిన కుట్రగానే భావిస్తూ, ఆ కోణంలోనే విచారణ జరుపుతోంది. ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, ట్రాక్‌ పక్కనే పెట్రెల్‌ బాటిల్‌, అగ్గిపెట్టె దొరకడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన వెనుక జమాత్‌-ఏ- ఇస్లామీ హస్తమున్నట్టు యూపీ పోలీసులు సందేహిస్తున్నారు. రైలు పట్టాలపై సున్నితమైన వస్తువులు ఉంచి.. తమాషా చూసే ఆకతాయి చర్యలు తరచూ జరిగేవే ఐనా.. ఇటువంటి డేంజరస్ ఫీట్లు మాత్రం కొత్తగా చూస్తున్నామని చెబుతోంది రైల్వే శాఖ.

2018 నుంచి ఏటా కనీసం 40 దాకా చిన్నాపెద్దా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా కనీసం మూడు చోట్ల రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక గత పదేళ్లలో ఏకంగా దాదాపు 700 ట్రెయిన్ యాక్సిడెంట్లు జరిగినట్లు ఒక లెక్కుంది. ఇటీవల రెండునెలల గ్యాప్‌లో రైలు ప్రమాదాల కారణగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 48 గంటల్లోనే నొయిడా సమీపంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఇలా సేఫ్ జర్నీ అనేది రైల్వే రికార్డుల్లో సందేహాస్పదంగా మారింది.

2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో 150 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో అనుమానాలొచ్చాయి. ముగ్గురు క్రిమినల్స్‌ని అరెస్ట్ చేసి.. ఆ దిశగా దర్యాప్తు చేశారు బీహార్ పోలీసులు. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్‌లో పట్టాలపై కుట్ర చేసి.. రైలు ప్రమాదాల్ని సృష్టించి.. ఆ విధంగా మోదీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ఎన్‌ఐఏ దర్యాప్తు ఏం తేల్చబోతోంది..? చూడాలి మరి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి