Indian Railways : భారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్ త్రీ టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ కోచ్‌లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌ను కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) కపుర్తల నుండి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) లక్నో మధ్య ట్రయల్ రన్ కోసం సిద్ధంగా ఉంచారు.
ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్‌సిఎఫ్)లో తయారు చేశారు. దీని రూపకల్పన 2020 అక్టోబర్‌లో ప్రారంభమైంది. రైళ్లలో ఈ నూతన ఎస్3 టైర్ ఎకానమీ కోచ్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్‌ల సంఖ్య 83కి చేరింది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది.
నూతన కోచ్ రూపకల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘‘కోచ్ రూపకల్పనలో అనేక నూతన ఆవిష్కరణలు చేర్చబడ్డాయి. ఆన్‌బోర్డులో ఏర్పాటు చేసిన హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ స్విచ్ గేర్ అండర్ ఫ్రేమ్‌కు దిగువకు మార్చబడింది. అంతేకాక, అదనంగా 11 బెర్తులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణీకుల సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.” అని పేర్కొంది. అంతేకాక, ప్రతి కోచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్నేహపూర్వక టాయిలెట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి డిజైన్‌లో అనేక మార్పులను కూడా చేసింది.
ప్రతి కోచ్‌లో మోడరన్ డిజైన్‌తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్‌ల కోసం ప్రత్యేక హోల్డర్లను అందించింది. స్టాండర్డ్ సాకెట్‌తో పాటు ప్రతి బెర్త్‌కు వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను పొందుపర్చింది. మధ్య, ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి నిచ్చెనలో ఎర్గోనామిక్‌గా మెరుగైన డిజైన్‌ను కూడా అందించింది. అంతేకాక, మధ్య, ఎగువ బెర్తులలో హెడ్‌రూమ్‌ను పెంచింది.
భారతీయ, పాశ్చాత్య తరహాలో రెస్ట్ రూమ్‌ను డిజైన్ చేసింది. ప్రయాణీకుల సౌకర్యాలలో భాగంగా పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. కోచ్‌లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం సౌలభ్యంగా ఉండేలా మెరుగుపర్చింది.
కోచ్ లోపల ప్రకాశించే ల్యుమినిసెంట్ గుర్తులను పొందుపర్చింది. బెర్త్ నంబర్లు ప్రకాశవంతంగా కనిపించేందుకు ఇల్యుమినేటెడ్ బెర్త్ ఇండికేటర్స్‌ను పొందుపర్చింది. కోచ్ లోపల ఫైర్ సేఫ్టీని కూడా ఏర్పాటు చేసింది. తద్వారా, అనుకోని ఏవైన ప్రమాదాలు జరిగితే.. వాటి నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది.
ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 248 రైళ్లలో ఎసి3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌సిఎఫ్ స్పష్టం చేసింది. ఈ కోచ్‌ల ఉత్పత్తి ఈ నెల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఇది ప్రయాణికుల సంఖ్య పెరగడానికి, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇది అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణం ఆహ్లాదకరమైన జ్ఞాపకాల ప్రయాణంగా మారుతుందని రైల్వే శాఖ పేర్కొంది.