
భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణీ మహిళలు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, వికలాంగులు, దృష్టిలోపం ఉన్నవారికి ట్రైన్లలో బెర్త్ కేటాయింపులకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైళ్లల్లో వీరికి ఇప్పటివరకు ప్రత్యేక లోయర్ బెర్త్‌లు రిజర్వ్ చేసి ఉండేవి. అయితే కొన్ని సమయాల్లో ఈ రిజర్వ్ బెర్త్‌లు వారికి లభించడం లేదు. ఈ క్రమంలో ఇక నుంచి సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌లు కేటాయించేలా కొత్త విధానం తీసుకొచ్చారు. దీని ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వాళ్లు ఎంపిక చేసుకోకపోయినా లభ్యత ఆధారంగా ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు.
సీనియర్ సిటిజన్లు, గర్భిణీ మహిళలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతీ కోచ్‌లో ప్రత్యేకంగా లోయర్ బెర్త్‌లు రిజర్వ్ చేసి ఉంటాయి. ఈ కోటా కింద వాటిని వారికి మాత్రమే కేటాయిస్తారు. స్లీపర్ కోచ్‌లలో అయితే 6 నుంచి 7 లోయర్ బెర్త్‌లు, థర్డ్ ఏసీలో అయితే 4 నుంచి 5, సెకండ్ ఏసీలో అయితే 3 నుంచి 4 బెర్త్‌లు వీరికి రిజర్వ్ చేసి ఉంటాయి.
ఇక వికలాంగులు, వారి సహాయకుల కోసం అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఉంటుంది. స్లీపర్ క్లాసులో నాలుగు బెర్త్ లు(రెండు లోయర్, రెండు మిడిల్ బెర్తులు), థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్ బెర్తులు) వారికి కేటాయిస్తారు. ఇక సెకండ్ క్లాస్, చైర్ కార్‌లో నాలుగు సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి.
వీరికి అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రత్యేక కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లలో విశాలమైన ఎంట్రీ డోర్స్, పెద్ద బెర్తులు, విశాలమైన మరుగుదొడ్లు, వీల్‌చైర్ పార్కింగ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల కోసం బ్రెయిలీ సంకేతాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక వందే భారత్ రైళ్లలోని తొలి, చివరి కోచ్‌లను వీరి కోసం కేటాయించారు. దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లతో పాటు సులభంగా బోర్డింగ్, డీబోర్డింగ్ కోసం మాడ్యులర్ ర్యాంప్‌లు అందుబాటులో ఉంటాయి.