Railway News: చంటి పిల్లతో రైలు ప్రయాణం చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయం. చిన్నారిని ఒంటరిగా పడుకో బెట్టకోలేరు, అలాగనీ ఒకే సీటులో తల్లీబిడ్డ పడుకోవడం సాధ్యపడదు. దీంతో బిడ్డలతో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనినే దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్న ఆలోచన చేశారు రైల్వే అధికారులు. నార్తన్ రైల్వేకు చెందిన లక్నో, ఢిల్లీ డివిజన్స్ సంయుక్తంగా రైళ్లలో బేబీ బెర్త్‌లను ప్రవేశపెట్టారు. వీటిని ఫోల్డ్ చేసుకునే వీలుగా రూపొందించారు.
ఈ బెర్త్‌లను మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ బెర్త్‌లను మొదట లక్నో మెయిల్ 12230 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని త్రీ టైర్ ఏసీ బోగీల్లో ప్రవేశపెట్టారు. తర్వాత ఇతర బోగీల్లో కూడా తీసుకురానున్నారు. ఈ విషయమై లక్నో డివిజన్ మెకానికల్ ఇంజనీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ..’ఈ బేబీ బెర్త్‌ను లోవర్ బెర్త్‌కు అనుసంధానిస్తారు. అవసరంలేని సమయంలో బేబీ బెర్త్‌ను ఫోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బెర్త్‌లను 76.2 ఎమ్‌ఎమ్ పొడవు, 255 ఎమ్‌ఎమ్ వెడల్పుతో రూపొందించారు’ అని చెప్పుకొచ్చారు.
రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చూపిన ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన అధికారుల రివ్యూ మీటింగ్‌లో మంత్రి ఈ ఆలోచనను ప్రాతిపాదించారన్నారు. చంటి బిడ్డలతో ప్రయాణించే తల్లులుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, త్వరలోనే వీటి సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బేబీ బెర్త్‌లను బుక్ చేసుకోవడంలో ఎలాంటి మెకానిజం లేదని, నేరుగా టికెట్ కలెక్టర్‌ను సంప్రదించి బేబీ బెర్త్‌ను పొందవచ్చని చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తలకు క్లిక్ చేయండి..