భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పొరుగు దేశాలతో సరకు రవాణా సేవల ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ రైల్వేకు చెందిన ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (NFR), భూటాన్‌ల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. అలీపుర్‌దూర్ డివిజన్‌లో ఇటీవల బిజినెస్ డెవపల్‌మెంట్ సమావేశం జరిగిందని, ఈ సమావేశానికి భూటాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాణిజ్య సంస్థలు హాజరయ్యారని ఎన్‌ఎఫ్‌ఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సవ్యసాచి తెలిపారు.
భూటాన్ వాణిజ్య ఎగుమతులు జరిపేందుకు వీలుగా ఎన్‌ఎఫ్‌ఆర్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న హసిమారా రైల్వే స్టేషన్‌ను ప్రతినిధులు సందర్శించారు. భూటాన్‌తో లాజిస్టిక్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో వేర్‌హౌస్‌తో పాటు సైడింగ్‌ను నిర్మించేందుకు ప్రణాళినను రూపొందిస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ఇదలిలా ఉంటే ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే 75 వాహనాలతో కూడిన మల్టీ మోడల్ రూట్ ద్వారా భూటాన్‌కు వస్తువులను ఎగుమతులు చేసింది.
ఇందులో భాగంగా వాహనాలను చెన్నై నుంచి హసిమారా రైల్వే స్టేషన్‌కు న్యూ మాడిఫైడ్ గూడ్స్ (NMG) రేక్ ద్వారా రవణా చేశారు. ఇది అక్టోబర్ 28న అలీపుర్‌దువార్ డివిజన్‌కు చేరుకుంది. అనంతరం సరకును రహదారి మార్గంగా భూటాన్‌కు తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో అధికారులు చగ్రబంధ స్టేషన్‌ను సందర్శించనున్నారు. వాణిజ్య రవాణాలో భాగంగా ఆటోమొబైల్స్, సిమెంట్ సరఫరాతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అస్సాంలో ఉన్న కోక్రాజార్ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకు బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌ను వేయడం ద్వారా భారతీయ రైల్వేలు సరిహద్దుల మధ్య అనుసంధానం కోసం ఇప్పటికే కొత్త ప్రాజెక్టులను చేపట్టాయని సీపీఆర్‌ఓ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..