మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సంను మరవక ముందే మరో తుపాను రెడీ అవుతోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసేందుకు మరో తుఫాన్ ముంచుకొస్తోంది. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయిగుండంగా మారనున్న అల్పపీడనం.. ఆ తర్వాత తీవ్ర తుపానుగా బలపడుతుందని హెచ్చరించింది. ఈనెల 26కి అది పెను తుఫాన్ గా మారుతుందని అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుతుందని తెలిపింది. అల్పపీడనం మరో మూడు రోజుల్లో తీవ్రవుగుండం మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖహెచ్చరించింది.
తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని జోన్ మీదుగా రాకపోకలు సాగించే 59 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ శనివారం రాత్రి ప్రకటించింది. హౌరా-హైదరాబాద్ (08645), హైదరాబాద్-హౌరా (08646), హౌరా-సికింద్రాబాద్ (02703) రైళ్లు ఈనెల 25 నుంచి 27 వరకు నిలిచిపోనున్నాయి . సికింద్రాబాద్-హౌరా (02704) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను 24 నుంచి 26 వరకు రద్దు చేశారు.
భువనేశ్వర్-సికింద్రాబాద్ (07015) 26 నుంచి 28 వరకు, సికింద్రాబాద్-భువనేశ్వర్ (07016) 24 నుంచి 26 వరకు రద్దయ్యాయి. తిరుపతి – పూరి (07479) ఎక్స్‌ప్రెస్ ఈనెల 24- 26 మధ్య, తిరుపతి-పూరి (నెం.07480) 26 నుంచి 28 వరకు నిలిచిపోనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. గౌహతి-సికింద్రాబాద్ (నెం.07029), సికింద్రాబాద్-షాలిమార్ (నెం.02774)25న, షాలిమార్-సికింద్రాబాద్ (నెం.02773)26న రద్దయ్యాయి.మిగిలిన వాటిలో ఎక్కువ రైళ్లు ఈనెల 26న ఒకరోజు, మరికొన్ని 27, 28, 29 తేదీల్లో రద్దయ్యాయి.
ఇక తుఫాన్ ప్రభావం తగ్గిన అనంతరం తిరిగి ఇందులోని కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉంది.