బుల్లెట్‌ వేగంతో జరుగుతున్న బుల్లెట్‌ ట్రైన్‌ పనులు.. కీలక ప్రక్రియ పూర్తయిందన్న భారత రైల్వే

|

Jan 06, 2025 | 9:45 PM

దేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులు పట్టాలపై శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో కీలక ప్రక్రియ పూర్తయింది. ఇది మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉపయోగించే స్పాన్‌-బై-స్పాన్‌ పద్ధతి కంటే పది రెట్లు వేగంగా జరుగుతోంది. మరోవైపు సూరత్‌లో ట్రాక్‌ బెడ్‌ నిర్మాణం ప్రారంభమైంది.

బుల్లెట్‌ వేగంతో జరుగుతున్న బుల్లెట్‌ ట్రైన్‌ పనులు.. కీలక ప్రక్రియ పూర్తయిందన్న భారత రైల్వే
Bullet Train Station
Follow us on

భారత్‌లో ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాయి. అయితే వందే భారత్ తర్వాత బుల్లెట్ రైలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మన దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కేందుకు సిద్ధం అంటున్నారు భారత రైల్వే అధికారులు. త్వరలోనే ఈ బుల్లెట్ రైలు పరుగులు పెడుతుందంటున్నారు.

దేశంలోనే తొలి బుల్లెట్ రైలు కోసం రైల్వే పగలు రాత్రి శ్రమిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల గుజరాత్‌లోని ఆనంద్‌లో నిర్మిస్తున్న బుల్లెట్ రైలు స్టేషన్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో స్టేషన్ లోపలి, వెలుపల వేగంగా జరుగుతున్న పనులను పంచుకుంది. “ఆధునిక రైలు మౌలిక సదుపాయాలు, అధిక వేగంగా పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది” అని క్యాప్షన్ రాసింది.

వీడియో చూడండి.. 

జపాన్ సహకారంతో ఈ బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు తీయాలి. జపనీస్‌ టెక్నాలజీ, సాంకేతిక సహకారం మాత్రమే కాదు.. దీనికోసం మన దేశానికి పెద్దఎత్తున దీర్ఘకాలిక రుణం అందించింది జపాన్‌. 2015లో పనులు మొదలు పెట్టిన ఈ బుల్లెట్‌ ట్రైన్‌ పనులు శరవేగంగా జరుగుతన్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. ఇది సెమీ హై స్పీడ్ రైలుగా ఉంటుంది. బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు తీయడం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

స్టేషన్ల నిర్మాణంలో గణనీయమైన పురోగతి ఉందని భారత రైల్వే శాఖ పేర్కొంది. సముద్ర సొరంగం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. జపాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సహకరిస్తోంది. దీనిని పూర్తి చేయడానికి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరంతరం పని చేస్తోంది. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు కారిడార్‌లో సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబై స్టేషన్లు ఉంటాయి.

రైల్వే మంత్రిత్వ శాఖ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడితో పట్టాలెక్కుతున్న బుల్లెట్ రైలు పనుల గురించి తెలియజేశారు. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. బుల్లెట్ రైలు మార్గం కోసం 24 వంతెనలు, ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. కారిడార్‌లో 7 కిలోమీటర్ల పొడవునా సొరంగం కూడా ఉంటుంది. బుల్లెట్ ట్రైన్‌ అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబైకి 2 గంటల్లో ప్రయాణించవచ్చు. ఈ రెండు నగరాల మధ్య 508 కి.మీ దూరం.

ఈ రైలు ప్రారంభమైన తర్వాత, ప్రారంభంలో 35 బుల్లెట్ రైళ్లు నడపనున్నారు. ఇవి ప్రతిరోజూ 70 ట్రిప్పులు చేస్తాయి. 2050 నాటికి ఈ సంఖ్యను 105 బుల్లెట్ రైళ్లకు పెంచనున్నారు. ఈ రైలులో ప్రతి సంవత్సరం 1.6 కోట్ల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ. 1.08 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటి రూ.5,000 కోట్లు అందించనున్నాయి. మిగిలిన నిధులు జపాన్ నుండి 0.1% వడ్డీ రేటుతో రుణం ద్వారా అందిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..