Smita Machhar: పైలట్ ధైర్యానికి సెల్యూట్.. స్మిత్ మచ్చార్ కుటుంబానికి భారీ నజరానా!

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు భారీ గుర్తింపు లభించింది. ఆయన సాహసానికి మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది. గాయపడినప్పటికీ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన మచ్చార్ ధైర్యానికి దేశం సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Smita Machhar: పైలట్ ధైర్యానికి సెల్యూట్.. స్మిత్ మచ్చార్ కుటుంబానికి భారీ నజరానా!
Captain Smith Machchar

Updated on: Oct 03, 2026 | 12:50 PM

న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు భారీ గుర్తింపు లభించింది. ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కెప్టెన్ మచ్చార్‌తో పాటు ఆయన కుటుంబానికి అందించనున్నట్లు సంస్థ తెలిపింది.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సౌదీ, ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. కో-పైలట్ కెప్టెన్ మచ్చార్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో విమానం భారీగా కిందికి దూసుకెళ్లింది.

తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఫ్లైదుబాయ్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన వెనుక కారణాలు, ఉద్దేశాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఫ్లైదుబాయ్ స్పష్టం చేసింది.

కాగా, కెప్టెన్ మచ్చార్ ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కూడా ఆయనకు ప్రత్యేక శౌర్య పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, మచ్చార్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ మాన్‌కైండ్ ఫార్మా.. “తన కంటే సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు” అంటూ రూ.కోటి బహుమతిని ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us