
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోంది.. ఇప్పటికే.. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలతో మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా మారుతుందని.. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన సుబ్రహ్మణ్యం.. భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే దానికి ఉన్న ఏకైక అతిపెద్ద ప్రయోజనం దాని ప్రజాస్వామ్యమని అని వివరించారు.
“ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్దదిగా ఉంటాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం” అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
తాజా IMF డేటా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం USD 4.3 ట్రిలియన్లు.. “మూడు సంవత్సరాలలో మనం జర్మనీ – జపాన్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటాము. 2047 నాటికి, మనం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (USD 30 ట్రిలియన్లు) కావచ్చు” అని సుబ్రహ్మణ్యం అన్నారు. లా సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు సహా భారతీయ కంపెనీలు ప్రపంచ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించాలని సుబ్రహ్మణ్యం కోరారు.
మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్కువ-ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ గుర్తించారు. “ఇది పేదలకు ఆహారం పెట్టడం లేదా దుస్తులు ధరించడం గురించి కాదని.. మీరు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా ఎలా మారతారనే దాని గురించి” అంటూ వివరించారు. జనాభా తగ్గిపోయే పరిస్థితిని ప్రపంచం ఎప్పుడూ చూడలేదని సుబ్రహ్మణ్యం ఎత్తి చూపారు.
సుబ్రహ్మణ్యం ప్రకారం.. జపాన్ 15,000 మంది భారతీయ నర్సులను తీసుకుంటోంది, జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను తీసుకువెళుతోంది.. ఎందుకంటే వారి వద్ద ప్రజలు లేరు.. అక్కడ కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయి. “ప్రపంచవ్యాప్తంగా పని చేసే వయస్సు గల వ్యక్తులకు భారతదేశం స్థిరమైన సరఫరాదారుగా ఉంటుంది… ఇదే మా ఏకైక అతిపెద్ద బలం అవుతుంది” అని సుబ్రహ్మణ్యం అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..