Delhi IGI Airport: రెండు ట్రాలీ బ్యాగులు నిండా ఉన్న గన్స్‌ను చూసి షాక్ తిన్నారు కస్టమ్స్ అధికారులు. వాటిని లెక్కపెడితే 45 ఉన్నాయి. ఆ హ్యాండ్ గన్స్‌ను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో దొరికిపోయారు జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే దంపతులు. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన ఈ దంపతులు వియత్నాం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. వాళ్లకో చంటిబిడ్డ ఉంది. వారిని అరెస్ట్ చేయడంతో ఆ బిడ్డను అమ్మమ్మకి అప్పగించారు అధికారులు. వియత్నాం నుంచి జగ్జీత్ దిగిన రోజే అతని అన్నయ్య మన్‌జిత్ సింగ్ కూడా పారిస్ నుంచి దిగాడు. మన్‌జిత్ సింగే జగ్జీత్‌కు గన్స్ ఉన్న బ్యాగ్‌లను అప్పగించి బయటకు వెళ్లిపోయాడని గుర్తించినట్టు కస్టమ్స్ కమిషనర్ జుబైర్ కమిలి చెప్పారు.
గన్స్ ఉన్న ఆ ట్రాలీ బ్యాగ్‌లను ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో జగ్జీత్ సింగ్ దంపతులు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన 45 తుపాకుల విలువ 22 లక్షల 50 వేలు ఉంటుంది. గతంలో కూడా టర్కీ నుంచి 12 లక్షల 50 వేల విలువైన గన్స్ తీసుకొచ్చినట్టు జగ్జీత్ సింగ్ దంపతులు ఒప్పుకున్నట్టు అధికారులు చెప్పారు. కస్టమ్స్ చట్టం 104 సెక్షన్ కింద జగ్జీత్ సింగ్ దంపతులను అరెస్ట్ చేశారు. గన్స్ స్మగ్లింగ్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.