Indian Army chopper crashes: భారత ఆర్మీకి చెందిన ధ్రువ్ ఛాపర్ సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక పైలట్ మరణించగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలోని లఖన్‌పుర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్-పంజాబ్ సరిహద్దు ప్రాంతంలోని లఖన్‌పుర్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన ధ్రువ్ ఛాపర్ సోమవారం రాత్రి ల్యాండ్ అవుతున్న క్రమంలో కుప్పకూలింది. క్రాష్ ల్యాండింగ్ వల్ల ఛాపర్‌కు మంటలు అంటుకొని దగ్ధమైంది. దీంతో ఛాపర్‌లో ఉన్న ఇద్దరూ పైలట్లు కూడా తీవ్రంగా గాయపడ్డారని కథువా ఎస్ఎస్పీ శలీందర్ మిశ్రా తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ పైలట్లను వెంటనే సమీపంలోని మిలటరీ బెస్ ఆసుపత్రికి తరలించినట్లు మిశ్రా వెల్లడించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక పైలట్ మరణించారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.