Under Water Metro Train: పర్యాటకులకు శుభవార్త.. త్వరలోనే మీరు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రయాణం చేయవచ్చు. అవును, కోల్‌కతాలోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో నుంచి మెట్రో రైలు నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా ఇంకొన్ని రోజుల్లోనే జరగనుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సివిల్ శైలేష్ కుమార్ ‘ఈ ఏడాది డిసెంబర్ నాటికి అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సేవలు ప్రారంభమవుతాయి. ఆ పనులలోనే ఇప్పుడు ఉన్నాం. త్వరలోనే ట్రయల్ కూడా నిర్వహిస్తా’మన్నారు. వాస్తవానికి గత ఆదివారమే ట్రయల్ రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినా, సాంకేతిక సమస్యల దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే.. సొరంగం పనులు పూర్తి కాగానే ట్రైన్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా హౌరా మైదాన్ , సాల్ట్ లేక్‌లలోని సెక్టార్ V లను కలుపుతూ తూర్పు– పశ్చిమ మెట్రో కారిడార్ మధ్య హుగ్లీ నదికి దిగువన రెండు సొరంగాలను నిర్మించారు. ఈ మార్గంలోని ఒక భాగంలో త్వరలో ట్రయల్ రన్‌ను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్(KMRC) షెడ్యూల్ చేసింది.
ఇందులో భాగంగా రెండు నుంచి ఆరు కోచ్‌లతో కూడిన మెట్రో రైలు “ఎస్ప్లానేడ్ – హౌరా మైదాన్” రూట్ లో 4.8 కి.మీ దూరం ట్రయల్ రన్ చేయనుంది. హుగ్లీ నదీగర్భం నుండి చెక్కబడిన సొరంగాలలో నుంచి మెట్రో రైలు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. నది దిగువన ఉన్న మార్గం కవర్ చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ 16 కి.మీ పొడవైన రైలు మార్గంలో 10.8 కి.మీ భూగర్భ విభాగాలు ఉన్నాయి. నది దిగువన ఉన్న భాగం కూడా ఇందులో చేర్చబడింది. ఈ మెట్రో రైలు హుగ్లీ నది దిగువన 13 మీటర్లు వెళుతుంది. హౌరా మెట్రో స్టేషన్ కూడా 33 మీటర్ల లోతు వరకు ఉంటుంది.
కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం.. భూగర్భ తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. కోల్‌కతా మెట్రోఈస్ట్-వెస్ట్ కారిడార్ పొడవు 15 కిలోమీటర్లు. ఇది హౌరా నుండి సాల్ట్ లేక్ సిటీ స్టేడియం వరకు విస్తరించి ఉంది. సాల్ట్ లేక్ సెక్టార్ 5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు ఈ మెట్రో మార్గంలో కరుణామయి, సెంట్రల్ పార్క్, సిటీ సెంటర్ మరియు బెంగాల్ కెమికల్ వద్ద మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా మెట్రో నార్త్-సౌత్ లైన్ ఎస్ప్లానేడ్ స్టేషన్‌ను హౌరా మరియు సీల్దాలోని రైల్వే స్టేషన్‌లతో కలుపుతుంది. ఇక కోల్‌కతా నగరం విషయానికి వస్తే.. ఇది 1984లోనే దేశం మొట్టమొదటి మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని చూసింది. ఢిల్లీ నగరం కోల్‌కతా కంటే చాలా ఆలస్యంగా 2002లో మెట్రో ట్రైన్ సేవలను అందించడం ప్రారంభించింది.
లండన్-పారిస్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ తరహాలో కోల్‌కతా మెట్రో ట్రైన్‌ను నడపనున్నారు. నీటి అడుగున రైలు జర్నీ ప్రారంభమైతే లక్షల మంది ప్రయాణికులకు రోడ్లపై ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. ఈ మెట్రో టెన్నెల్ నిర్మాణానికి దాదాపు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హౌజ్ ఖాస్ తర్వాత.. కోల్‌కతాలోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 మీటర్ల లోతుగా ఉంటుంది. ప్రస్తుతం.. హౌజ్ ఖాస్ 29 మీటర్ల లోతైన స్టేషన్ గా పరిగణించబడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..