
ఇండియా మారీటైమ్ వీక్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. షిప్పింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. భారత ఆర్ధికాభివృద్దిలో మారీటైమ్ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
ముంబైలో ఇండియా మారీటైమ్ వీక్‌లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారత తీరప్రాంతంలో అపారమైన సహజసంపద ఉందన్నారు. గత 11 ఏళ్లలో భారత మారీటైమ్ రంగం ఉన్నతశిఖరాలను అధిరోహించిందన్నారు. మారీటైమ్ రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని అన్నారు. ఇండియా మారీటైమ్ వీక్‌లో 85 దేశాలు పాల్గొన్నారు. రూ. 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. సుస్థిర ఆర్ధికాభివృద్దికి మారీటైమ్ రంగం చాలా తోడ్పడుతుందన్నారు. విలింజం పోర్ట్ నిర్మాణంతో భారత్ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు.
21వ శతాబ్ధంలో భారత మారీటైమ్ రంగం ఎంతో వేగంగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది భారత మారీటైమ్ రంగానికి కీలకంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాల్లో విలింజం పోర్ట్ రూపంలో భారత్‌లో తొలి డీప్ వాటర్ పోర్ట్‌ను నిర్మించాము. కొద్దిరోజుల క్రితమే ప్రపంచంలో అతిపెద్ద కంటేనర్ షిప్ అక్కడికి చేరుకుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించే క్షణం ఇదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. షిప్పింగ్ రంగంలో కాలం చెల్లిన నిబంధనలను రద్దు చేశామన్నారు మోదీ. కొత్త సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భారత పోర్ట్‌లను ప్రపంచస్థాయికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సముద్ర రవాణా , వాణిజ్యం గతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందన్నారు. తీరప్రాంతం అభివృద్దితో ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మోదీ. భారత ఆర్ధికాభివృద్దిలో మారీటైమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..