మన దేశంలో పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మన దేశంలో అంతరించి పోతున్న చిరుతలను విదేశాల నుంచి తీసుకుని మళ్ళీ పెంచే విధంగా ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ‘ప్రాజెక్ట్ చిరుత’గా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద వన్య జాతులను ప్రత్యేకించి చిరుతలను సంరక్షించడం కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) మార్గదర్శకాల ప్రకారం చిరుతలను భారతదేశానికి తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చారు. మరోవైపు మన దేశంలో ఒక నెల వ్యవధిలోనే 24 పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు గత మూడు సంవత్సరాల నుంచి పులుల మరణాల గణాంకాలను రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 8 మధ్య కేవలం ఒక నెల వ్యవధిలో భారతదేశంలో 24 పులులు మృతి చెందాయి. గత ఏడాది ప్రారంభంలో 16 పెద్ద పులుల మరణించాయి. అదే సమయంలో 2021లో 20 మరణాలు నమోదయ్యాయని వెల్లడించింది. గత మూడేళ్ళలో లెక్కలను ప్రకారం.. ఈ ఏడాది పులులు అధికంగా మరణించినట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ లో తొమ్మిది పులులు మరణించాయి. మహారాష్ట్రలో ఆరు, రాజస్థాన్ లో మూడు, కర్ణాటక లో రెండు, ఉత్తరాఖండ్ లో రెండు, అస్సాం, కేరళ లో ఒకొక్క పెద్ద పులి చొప్పున మొత్తం ఒక్క నెలలో 24 పెద్ద పులులు మృతి చెందాయి.
గత దశాబ్ద కాలంగా గణాంకాలను పరిశీలిస్తే.. జనవరిలో అత్యధికంగా పులి మరణాలు నమోదయ్యాయి. NTCA డేటా 2012-2022 మధ్య జనవరిలో 128 పులులు చనిపోగా, మార్చి లో 123 పెద్ద పులులు , మే లో 113 పులుల మరణాలు సంభవించాయి. అయితే పులుల మరణానికి కారణాలను పరిశీలిస్తే.. వృద్ధ్యాప్యంతో సహా సహజ కారణాలతో పాటు.. ప్రాదేశిక పోరాటాలు అని తెలుస్తోంది. అయితే పులుల మృతికి వేటగాళ్ల ఏమైనా కారణమా అనే కోణంలో కూడా డేటాను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
“దేశవ్యాప్తంగా పులుల సంఖ్య 3,000 కంటే అధికంగా ఉంది. ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. కొన్ని మరణాలు సాధారణం. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించడం అని అంటున్నారు అధికారులు. ప్రోటోకాల్ ప్రకారం పులుల మృతిపై దర్యాప్తు చేస్తున్నామని NTCA అధికారి ఒకరు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..