Lata Mangeshkar: తన కారణంగా ఇతరుల కెరీర్‌ పాడవ్వకూడదన్నది లతా మనస్తత్వం!

శ్యామ్‌ సుందర్‌ వాగుడును లతా భరించలేకపోయింది. ఒక్క టేకు కూడా పాడకుండా వచ్చేసింది. తర్వాత శ్యామ్‌సుందర్‌ ఎంత బతిమాలినా పాడేందుకు వెళ్లలేదు లతా.

Lata  Mangeshkar: తన కారణంగా ఇతరుల కెరీర్‌ పాడవ్వకూడదన్నది లతా మనస్తత్వం!
Lata

Edited By:

Updated on: Feb 06, 2022 | 6:34 PM

Lata Mangeshkar on Pandit Shyam Sundar: అప్పట్లో శ్యామ్‌సుందర్‌ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో చేసింది 24 సినిమాలే అయినా అద్భుతమైన పాటలిచ్చాడు. ఆ రోజుల్లో ఆయనకు మంచి పేరు ఉండేది. లాహోర్‌ అనే సినిమాలో ఓ పాట కోసం అప్పుడప్పుడే పైకి వస్తున్న లతా మంగేష్కర్‌ను పిలిపించాడు. శ్యామ్‌సుందర్‌ గొప్ప సంగీత దర్శకుడే అయినా తాగుడు అలవాటు ఉంది.. తాగినప్పుడు ఒళ్లు మర్చిపోయేవాడు. అందరిని అడ్డమైన తిట్లు తిట్టేవాడు. లతా పాడుతున్నప్పుడు .. ఒళ్లు దగ్గరపెట్టుకుని పాడు.. ఇది ఆషామాషీ ట్యూన్‌ కాదు, శ్యామ్‌ సుందర్‌ బాణి ఇది అని అన్నాడు.. దాంతో పాటు కొన్ని అనకూడని మాటలు కూడా అనేశాడు.

శ్యామ్‌ సుందర్‌ వాగుడును లతా భరించలేకపోయింది. ఒక్క టేకు కూడా పాడకుండా వచ్చేసింది. తర్వాత శ్యామ్‌సుందర్‌ ఎంత బతిమాలినా పాడేందుకు వెళ్లలేదు లతా. తన పాటకు లతా మాత్రమే న్యాయం చేయగలదన్న నమ్మకం శ్యామ్‌ సుందర్‌ది! నిర్మాతేమో మరొకరితో పాడించేయమన్నాడు. శ్యామ్‌సుందర్‌ మాత్రం ఒప్పుకోలేదు. చివరకు నిర్మాతే లతా దగ్గరకు వెళ్లి ప్రాధేయపడ్డాడు. శ్యామ్‌సుందర్‌ మళ్లీ అలా ప్రవర్తించకుండా చూసే బాధ్యత నాది అని ప్రామిస్‌ చేశాడు. అప్పుడు కానీ లతా పాడేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా శ్యామ్‌ సుందర్‌ అలాగే బీహేవ్‌ చేశాడు. లతా పాడనని మొహం మీదనే చెప్పేసి వచ్చేసింది. లతా పాడకపోతే తనకు హిట్స్‌ రావా అన్న మొండి ధైర్యంతో శ్యామ్‌సుందర్‌ మిగతా వారితో పాడించాడు. ఆ సినిమాలు, అందులోని పాటలు పెద్దగా జనరంజకం కాలేదు.

ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ నిర్మాత అలీఫ్‌లైలా అనే సినిమాకు శ్యామ్‌సుందర్‌ను సంగీత దర్శకుడిగా నియమించుకున్నాడు. శ్యామ్‌సుందర్‌కు లతా పాడదన్న సంగతి పాపం అప్పుడా నిర్మాతకు తెలియదు. తెలిసిన తర్వాత శ్యామ్‌ సుందర్‌ను మార్చాలనుకున్నాడు. ఈ విషయం లతాకుతెలిసింది. బాగా బాధపడింది. తన కారణంగా శ్యామ్‌సుందర్‌ కెరీర్‌ దెబ్బతినకూడదని అనుకుంది. శ్యామ్‌సుందర్‌ను మళ్లీ సంగీత దర్శకుడిగా నియమిస్తే తాను పాడతానని నిర్మాతకు చెప్పింది. అప్పటికే నిరాశతో సినిమా పరిశ్రమను వదిలి వెళ్లిపోయాడు శ్యామ్‌సుందర్‌.. ఎలాగో అలాగా ఆయనను వెతికి పట్టుకొచ్చాడు నిర్మాత. తన కారణంగా ఇతరులు నష్టపోకూడదన్నది లతా భావన.