ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌.. ఎయిర్‌ ఫోర్స్‌ మెనూలో అదిరిపోయిన ఐటమ్స్‌! మీరూ ఓ లుక్కేయండి!

భారత వైమానిక దళం (IAF) 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్‌ను ట్రోల్ చేస్తూ ప్రత్యేక మెనూను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో IAF నాశనం చేసిన పాకిస్తానీ వైమానిక స్థావరాల పేర్లతో కూడిన వంటకాలతో కూడిన ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌.. ఎయిర్‌ ఫోర్స్‌ మెనూలో అదిరిపోయిన ఐటమ్స్‌! మీరూ ఓ లుక్కేయండి!
Indian Air Force Day Menu

Updated on: Oct 09, 2025 | 2:56 PM

బుధవారం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తన 93వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక విందులో ప్రత్యేకమైన మెనూ ఏర్పాటు చేశారు. ఈ విందులో రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, రఫీకి రారా మటన్, జాకోబాబాద్ మేవా పులావ్, బాలాకోట్ తిరామిసు వంటి వంటకాలతో IAF పాకిస్తాన్‌ను ట్రోల్‌ చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌పై IAF వైమానిక ఆధిపత్యాన్ని మెనూ రూపంలో ప్రదర్శించింది. ముఖ్యంగా సైనిక ఆపరేషన్ సమయంలో IAF నాశనం చేసిన వైమానిక స్థావరాల పేరు మీద ఈ వంటకాలకు పేర్లు పెట్టారు. ఈ మెనూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెనూను అనేక మంది ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్లు షేర్ చేశారు.

ఈ మెనూ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని వంటకం మెనూలో లేదని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేశారు. భారత్‌ దాడుల సమయంలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం విస్తృతంగా దెబ్బతింది. ఇక మరో కామెంట్‌ ట్రంప్‌ను ట్రోల్‌ చేస్తూ వచ్చింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య సైనిక వివాదాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వం వహించానని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కొంతమంది నెటిజన్లు తప్పుబట్టారు. నోబుల్ పీస్ హల్వా? లేదా అంటూ పరోక్షంగా ట్రంప్‌ను ట్రోల్‌ చేశారు.

ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, మే 6, 7 తేదీల మధ్య రాత్రి భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత పౌర, సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారతదేశ వైమానిక రక్షణ ఆ దాడిని తిప్పికొట్టింది. మే 9, 10 తేదీల మధ్య రాత్రి, నూర్ ఖాన్, సర్గోధా, జకోబాబాద్‌లతో సహా 11 పాకిస్తానీ వైమానిక స్థావరాలను భారత్‌ దాడి చేసింది. మే 10న భారత్‌ పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి