దాదాపు ఐదేళ్లుగా ఏఐసీసీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన నటి రమ్య అలియాస్ దివ్య స్పందన.. ఆ మధ్యన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే తన సొంత సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా ఆమె డిలీట్ చేశారు. ఇలా మొత్తానికి ఆమె సోషల్ మీడియాకు దూరం అవ్వడంతో ‘రమ్యా ఎల్లిదియమ్మా’ అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. కాగా వీటన్నింటికి తాజాగా సమాధానం ఇచ్చారు రమ్య. సోషల్ మీడియా హెడ్‌గా రాహుల్ గాంధీ తనను నియమించినప్పుడు తానేం పెద్ద అనౌన్స్‌మెంట్ చేయలేదని గుర్తుచేసిన రమ్య.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కూడా అలాగే ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా పెళ్లి వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.
తాను దుబాయ్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని.. దీనిపై ఎందుకు హైప్ వచ్చిందో కూడా తనకు అర్థం కాలేదని ఆమె వాపోయారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుండటంతో.. ఆ ఫ్లాట్‌ఫాంలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలీదని చెప్పుకొచ్చారు. ఇక సినిమా ఆఫర్లు కూడా తనకు వస్తున్నాయని.. కానీ రాజకీయంగా కొన్ని కమిట్‌మెంట్లు ఉండటం వలన ఏ సినిమాకు ఇంతవరకు ఓకే చెప్పలేదని ఆమె తెలిపారు. అయితే వెంటనే.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొనడం విశేషం. ఇక జీవితంలో మీ తదుపరి స్టెప్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ‘‘మొదట్లో సినిమాలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. అందుకే వాటిలో నటించాను. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి రావడంతో అటుగా వెళ్లాను. ఇక భవిష్యత్‌లో నాకు దేనిపైనైనా ఆసక్తి వస్తే అది కచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చాలా సంతోషంగా ఉన్నాను’’ అని రమ్య స్పష్టం చేశారు.