
ధార్, ఏప్రిల్ 10: నల్లగా ఉన్నాడని, తన అందానికి సరిపోడని భావించిన ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. హత్య తర్వాత సినీ ఫక్కీలో అద్భుతమైన కథ అల్లేసింది. తమ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడి అడ్డొచ్చిన భర్తను హత్య చేసి.. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ముసలి కన్నీరు కార్చింది. పోలీసుల ఎంట్రీతో అసలు గుట్టు బయటపడింది. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్‌లోని థార్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా గోండిఖేడ గ్రామంలో దేవకృష్ణ పురోహిత్ (28), ప్రియాంక దంపతులు. దేవకృష్ణ సుంగధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు. అయితే ఏప్రిల్ 7న అర్ధరాత్రి పూట రాత్రిపూట గుర్తుతెలియని దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేసి, తన భర్త దేవకృష్ణను చంపి పారిపోయారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇల్లు మొత్తం చిందరవందరగా పడి ఉండగా, దేవకృష్ణ రక్తం మడుగులో పడి ఉండటం గమనించారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి. ఆమె సంఘటనా స్థలంలో ఏడుస్తూ కనిపించింది. ఇంట్లో విలువైన వస్తువులతోపాటు రూ.3.5 లక్షల డబ్బు కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రియాంక తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు కథ బయటపడింది.
ఇటీవల దేవకృష్ణ, ప్రియాంకకు వివాహం జరిగింది. అయితే వారి వివాహ బంధం సవ్యంగా సాగలేదు. తరచు దంపతులు గొడవపడేవారని దేవకృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రియాంక తరచు అతని భర్త చర్మం రంగును ఎగతాళి చేస్తూ ‘నువ్వు నల్లగా ఉన్నావు. నువ్వు నాకు తగవు. నేను నీకంటే మంచివాడికి అర్హురాలిని’ అని అనేదని, పలుమార్లు విడాకులు సైతం కోరిందని తెలిపారు. ఇక పోలీసుల దర్యాప్తులో మరో షాకింగ్ విషయం తెలిసింది. ప్రియాంక 2020 నుంచి కమలేష్ అనే మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. వివాహం తర్వాత దేవకృష్ణను చంపడానికి వీరిద్దరూ కుట్ర పన్ని, ఆ తర్వాత దాన్ని దోపిడీగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇందుకు కమలేష్ తన సహచరుడైన సురేంద్రను ఈ హత్య కోసం పురమాయించాడు. దాదాపు లక్ష రూపాయల కాంట్రాక్టుకు కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 7న దేవకృష్ణ నిద్రిస్తున్న సమయంలో ప్రతిఘటనకు ఆస్కారం లేకుండా ఈ పథకాన్ని రాత్రిపూట అమలు చేశారు. దేవకృష్ణపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
దీన్ని దోపిడీగా చిత్రీకరించడానికి నిందితులు ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసి, ప్రియాంకను కట్టేసి దోపిడీ జరిగినట్లుగా నాటకాన్ని సృష్టించారు. ఆ తర్వాత నిందితులు పారిపోగా.. పథకం ప్రకారం ఆమె కేకలు వేసింది. ఇరుగు పొరుగు వచ్చేటప్పటికీ ముందుగా అనుకన్నట్లు కట్టుకథ అందరికీ చెప్పి నమ్మించింది. అయితే ఈ కేసును 36 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులైన ప్రియాంక, కమలేష్‌లను అరెస్టు చేయగా, మూడో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని ధార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ అవస్థి మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.