
అత్యధిక సుంకాల తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇండియాపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన తర్వాత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ మధ్య దూరం కాస్త పెరిగిందనే చెప్పాలి. కానీ, గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు చాలా క్లోజ్ అంటూ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు సందర్భంగా మోదీకి ఫోన్ చేసిన మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు.
“నేను ఇండియాకి, మోదీకి చాలా క్లోజ్. మొన్న మోదీతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. మాకు చాలా మంచి సంబంధం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే సుంకాల ఉద్రిక్తతలను పరిష్కరించే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత్, అమెరికా చర్చలు జరుపుతున్నాయి. నవంబర్ 30 తర్వాత వాషింగ్టన్ 25 శాతం జరిమానా సుంకాలను ఉపసంహరించుకోవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు.
అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలు గతంలో ఆయన ఇండియా గురించి చేసిన ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రష్యాతో చమురు వ్యాపారంపై ఇండియాపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పుతిన్‌కు నిధులు సమకూర్చడంలో ఇండియా సహాయపడుతుందని ఆరోపించారు. ఇదే కారణంగా ఆయన భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలను విధించి, మొత్తం సుంకాలను 50 శాతానికి పెంచారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కావడంతో పాటు ఇద్దరు నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ట్రంప్ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ చర్చల గురించి ప్రస్తావిస్తూ “భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి