కర్ణాటకలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేయవద్దని మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్య అన్నారు. ఇప్పటికే పార్టీలో దీనిపై తీవ్ర వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేస్తూ… నేను సీఎం అభ్యర్థిని అవుతానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పార్టీ నాయకత్వం ఎవరు కావాలని నిర్ణయిస్తారో వారే అవుతారని ఆయన చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్యేలను కోరుతున్నానని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డి.కె. శివకుమార్ సీఎం అభ్యర్థి అవుతారని పార్టీలో మరికొందరు ప్రచారం చేయడంతో పార్టీ రాష్ట్ర శాఖలో రెండు వర్గాలు ఏర్పడినట్టు అయింది. కాగా- శివకుమార్ కూడా పరోక్షంగా తానే ఇందుకు అర్హుడినని పేర్కొన్నారు. సిద్దరామయ్య లెజిస్లేచర్ పార్టీ నాయకుడని, సీఎం అభ్యర్థిని కావాలని తాను తొందరపడటం లేదని ఆయన చెప్పారు. మొదట పార్టీ హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తే వారే అవుతారు అన్నారు. మొదట రాష్ట్రంలో బీజేపీని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలనీ తాను కోరుతున్నానని ఆయన చెప్పారు. ఇందుకు ఆయుధంగా తనను వాడుకోవాలని శివకుమార్ అన్నారు.
బీజేపీని ఓడించడమే మన లక్ష్యం కావాలని ఆయన చెప్పారు. ఇలా ఉండగా చామరాజ్ పేట్ , కొప్పల్, కంప్లి, హరిహర తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.. తమ నేత సిద్దరామయ్యేనని, వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థి కావాలని కొంతకాలంగా బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. తన మద్దతుదారులు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఆయన గురువారం ఖండించారు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: SVR Rare Photo: యముని వేషంలో ఎస్వీఆర్ ను చూసి ప్రశంసించిన అప్పటి చైనా ప్రధాని.. ఫోటో వైరల్