వైద్య వృత్తిలోనే ఉంటానని స్పష్టం చేసిన కఫీల్‌ఖాన్‌

|

Sep 08, 2020 | 12:49 PM

కాంగ్రెస్‌ పార్టీలో చేరతారంటూ వస్తున్న కథనాలను డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ కొట్టిపారేశారు.. మొన్నీమధ్యనే మధుర జైలు నుంచి విడుదలైన కఫీల్‌ఖాన్‌ పాలిటిక్స్‌లోకి వస్తారంటూ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది.

వైద్య వృత్తిలోనే ఉంటానని స్పష్టం చేసిన కఫీల్‌ఖాన్‌
Follow us on

కాంగ్రెస్‌ పార్టీలో చేరతారంటూ వస్తున్న కథనాలను డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ కొట్టిపారేశారు.. మొన్నీమధ్యనే మధుర జైలు నుంచి విడుదలైన కఫీల్‌ఖాన్‌ పాలిటిక్స్‌లోకి వస్తారంటూ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది.. అయితే తాను డాక్టర్‌ వృత్తిలోనే ఉంటానని, రాజకీయాలలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారాయన! జాతీయ భద్రతా చట్టం కింద కఫీల్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేసిన విషయమూ విదితమే! ఆలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో కఫీల్‌ఖాన్‌ చేసిన ప్రసంగం విద్వేశాలను రెచ్చగొట్టేలా లేదని హైకోర్టు స్పష్టం చేసింది కూడా!

అయితే సెప్టెంబర్‌ ఒకటిన కోర్టు ఆదేశాలు వచ్చినా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం కఫీల్‌ను జైలు నుంచి విడుదల చేయడానికి కాసింత సమయం తీసుకుంది.. మళ్లీ ఏదో ఒక కేసు బనాయించి తనను జైల్లో తోస్తారేమోనన్న భయం వేసిందని కఫీల్‌ అన్నారు.. ఆ సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తనకు ధైర్యం చెప్పి, ఆదుకున్నారని చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌లో షెల్టర్‌ తీసుకున్న కఫీల్‌ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు.. వాటన్నంటికీ తెరవేస్తూ ఒక వైద్యుడిగా తన అవసరం పేదలకు ఉందన్నారు.. బీహార్‌ వరద బాధితులకు సాయం చేయడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టానని చెప్పారు. 2017లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంతో వార్తల్లోకెక్కిన గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో కఫీల్‌ఖాన్‌ వైద్యుడిగా ఉన్నారు. అప్పడు ఆయనతోపాటు మరికొంతమంది వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తర్వాత ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఆయన నిర్దోషి అని తేలింది.