
పుణెలో బిజినెస్‌మెన్ కుమారుడు కేతన్ హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాద మరణంగా కనిపించిన ఈ ఘటన వెనుక ప్రేమ, మోసం, ముందస్తు కుట్ర దాగి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది సియా, చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు. ఇద్దరి మధ్య మొత్తం 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధంతో పాటు హత్య కుట్రకు బలమైన ఆధారంగా మారింది.
దర్యాప్తు ప్రకారం.. కేతన్‌ను హత్య చేయడానికి సియా గతంలోనే ఒకసారి ప్రయత్నించింది. లోహ్‌గఢ్ కోటకు తీసుకెళ్లి లోయలోకి తోసేయగా.. చెట్టు కొమ్మను పట్టుకుని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనిపించడంతో భయపడి తోసేశానంటూ సియా నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ఘటనను ప్రమాదంగానే భావించారు. అయితే మొదటి ప్రయత్నం విఫలమైనా.. సియా వెనక్కి తగ్గలేదు. ఈసారి ప్రియుడు చేతన్‌తో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించింది. జూన్ 18న బర్త్‌డే పేరుతో మరోసారి అదే ప్రాంతానికి కేతన్‌ను తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ట్రెక్కింగ్ చేస్తుండగా గాలికి బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయాడని సియా చెప్పినా.. ఆమె వాంగ్మూలంలో అనేక ప్రశ్నలు కనిపించాయి.
ఇక ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరా దృశ్యాలు కీలకంగా మారాయి. లోహ్‌గఢ్ కోటకు వెళ్లే మార్గంలో తీవ్ర ఎండలోనూ హుడీ, ముసుగు ధరించి తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 33 డిగ్రీల ఉష్ణోగ్రతలో అలాంటి దుస్తులు ధరించడంపై అనుమానం రావడంతో అతడి వివరాలు ఆరా తీశారు. ఫొటోలను పోల్చి చూడగా.. అతడే సియా ప్రియుడు చేతన్ అని నిర్ధారణ అయింది. పోలీసులకు చిక్కకుండా ఉండాలనుకున్న ముసుగే చివరకు అతడిని పట్టించింది.
సియా ప్రవర్తనపై మొదటి నుంచే అనుమానం వ్యక్తం చేసిన కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ముమ్మరమైంది. కాల్ డేటా, సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు.. ఇది ప్రమాదం కాదు, ముందే పథకం వేసి చేసిన హత్య అని నిర్ధారించి సియా గోయల్, చేతన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి