ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్ష బీభత్సం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి

ఢిల్లీలో వర్ష బీభత్సంతో ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్‌ పైకప్పు ధ్వంసమైంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ముగ్గురు చనిపోగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్ష బీభత్సం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి
Delhi Ncr Rains

Updated on: May 17, 2025 | 9:33 PM

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. న్యూ అశోక్ నగర్‌లో ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్‌ పైకప్పు ధ్వంసమైంది. రేకులు ఎగిరిపడటంతో అటుగా వెళ్తున్న వారు గాయపడ్డారు. ఒక కారు అద్దం పగిలిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈదురు గాలుల కారణంగా నోయిడాలోని డీఎం చౌక్‌ దగ్గర ట్రాఫిక్‌ పోల్‌ పడిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినా.. ఈదురు గాలులతో కూడిన వర్షం.. అతలాకుతలం చేసింది..

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి..

ఢిల్లీలోని నబి కరీమ్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారు. వెంటనే ఆప్‌ ఎమ్మెల్యే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పహార్‌గంజ్ నిర్మాణ స్థలం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మరణించారని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. మృతులను బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ప్రభు (65), నిరంజన్ (40), ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన రోషన్ (సుమారు 35)గా పోలీసులు గుర్తించారు. ప్రభు కాంట్రాక్టర్‌గా ఉండగా, నిరంజన్, రోషన్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ముంగేర్ నివాసి అయిన చుట్టన్ (35) గాయాలతో ఆసుపత్రిలో చేరాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోయి బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..