
హర్యానా: పల్వాల్ జిల్లాలో కుండ్లీ-మానే సర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికులతో కూడిన పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన సుమారు 21 మంది భక్తులు శుక్రవారం పుణ్యయాత్రకు బయలుదేరినట్లు సమాచారం. వారు రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ ఆలయం, సాలాసర్ బాలాజీ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనంతరం మథుర-బృందావన్ వైపు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున పల్వాల్ సమీపంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును పికప్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి పికప్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. వాహనంలో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సులు, ఇతర వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో 16 మంది గాయపడ్డారని పేర్కొంటున్నాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, కునుకు తీయడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. రహదారి పక్కన ట్రక్కును ఏ పరిస్థితుల్లో నిలిపారు, పికప్ డ్రైవర్ దాన్ని ఎందుకు గుర్తించలేకపోయాడు అనే అంశాలపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. యాత్ర ముగించుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటనతో మైన్‌పురి జిల్లాలోని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..