Board Exam: రోజు రోజుకీ విద్యార్ధుల ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యార్ధులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిలయినా, మంచి ర్యాంక్ రాకపోయినా తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఈ విద్యార్ధులు కొత్తగా ఆలోచించారు. తల్లిదండ్రులు వినని తమ గోడును బోర్డ్ ఎగ్జామ్ పేపర్‌ద్వారా వెల్లబోసుకున్నారు. తమను పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ప్రశ్నపత్రాల్లో కొందరు విద్యార్థులు విచిత్ర ధోరణి కనబర్చారు. దయచేసి తమకు పాస్ మార్కులు వేయాలని కొందరు కోరితే, మరికొందరు మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ ఘటనలు హర్యానాలో పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్నాయి.
తన తండ్రి బాగా తాగుతాడని, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురవుతున్నానని ఓ విద్యార్థిని రాస్తే.. తనకు ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఉందని, అయితే, ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే తన తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడని జవాబు పత్రాల్లో తెలిపింది. కూతురిలా భావించి తనను పాస్ చేయాలని కోరింది. మరో విద్యార్థి.. తనకు ఓ ప్రశ్నకు సమాధానం తెలియదని, దయచేసి పాస్ మార్కులు వేయాలని కోరాడు. అంతేకాదు, తాను మంచి విద్యార్థినని, బాగా చదువుతానని రాసుకొచ్చాడు. మరికొందరు విద్యార్థులు కూడా ఈ విధంగానే రాసి తమను ఎలాగైనా పాస్ చేయాలని కోరారు. దీనిపై విద్యాశాఖాధికారి దయానంద్ సింగ్ స్పందిస్తూ.. విద్యార్థులు జవాబు పత్రాలపై ఇటువంటి రాతలు రాస్తున్నారని, పరీక్షల్లో ఇటువంటివి రాయకూడదని టీచర్లు తరగతి గదిలోనే విద్యార్థులకు చెప్పాలని కోరారు. కాగా పశ్చిమ బెంగాల్ లోనూ ఇటీవల చాలా మంది విద్యార్థులు జవాబు పత్రాల్లో ఇటువంటి రాతలే రాయడం చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..