ప్రాణాలు తీసే మరో ప్రాణాంతక వ్యాధి తరుముకొస్తోంది. చాప కింద నీరులా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. కరోనా నుంచి బయటపడిన ప్రపంచాన్ని మరో ముప్పు.. హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ రూపంలో వెంటాడుతోంది. ఇప్పటికే దేశంలో పలువురిని బలితీసుకుంది. దీంతో ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్-19 సహ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసుల ధోరణి పెరగడంపై ఆరోగ్య అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్లూ లక్షణాలతో ఆస్పత్రులతో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఐసీయూలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున పరీక్షలు పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. అటు తమిళనాడులో వేగంగా విస్తరిస్తోంది హెచ్3ఎన్2 వైరస్. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 545 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. ఫ్లూతో బాధపడుతున్నవారు ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరిన బాధితులు చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలోనే తిరుచ్చికి చెందిన ఉదయ్ కుమార్ ఇన్ ఫ్లూయెంజా ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
గత వారం గోవా నుంచి వచ్చిన ఉదయ్.. జ్వరం, దగ్గు, జలబుతో బాధపడుతున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయ్ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో తిరుచ్చిలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజా రెండూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉన్నాయనీ, అవి రెండు నుండి మూడు నెలలు ఉండవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండింటి వ్యాప్తి పెరుగుదల ఆందోళన కలిగించే విషయమని హెచ్చరిస్తున్నారు. ఇన్ ఫ్లూయెంజా అనుమానిత రోగుల నమూనాలను కోవిడ్ -19 కోసం కూడా పరీక్షిస్తున్నామని ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఎడ్యుకేషన్ చైర్మన్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, హెచ్ 1 ఎన్ 1 వైరస్ ఉత్పరివర్తన అయిన హెచ్3 ఎన్2 వైరస్ ప్రతి సంవత్సరం ఈ సమయంలో వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వాటి మ్యుటేషన్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..