అస్తమానం ఏడుస్తున్నాడనీ.. 3 నెలల పసివాడిని నీటిసంపులో పడేసి కడతేర్చిన కన్నతల్లి!

పసిపిల్లలు పుట్టగానే మాట్లాడలేరు. ఏది చెప్పాలన్నా ఆనందం కలిగితే నవ్వడం ద్వారా, బాధ కలిగితే ఏడ్వడం ద్వారా తెలుపుతారు. సాధారణంగా ఏ తల్లైన పసిబిడ్డ సంకేతాలను అర్ధం చేసుకుని వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే ఓ తల్లి మాత్రం పిల్లాడు అస్తమానం ఏడుస్తున్నాడనీ చంపి చేతులు దులుపుకుంది..

అస్తమానం ఏడుస్తున్నాడనీ.. 3 నెలల పసివాడిని నీటిసంపులో పడేసి కడతేర్చిన కన్నతల్లి!
Mother Kills Son For Crying

Updated on: Apr 10, 2025 | 8:00 PM

అహ్మదాబాద్‌, ఏప్రిల్ 10: నెలల వయసున్న పసివాడు అదే పనిగా ఏడుస్తున్నాడని విసిగెత్తిన ఓ తల్లి.. నీళ్ల సంపులో విసిరేసింది. చిన్న ప్రాణం నీటిలో ఊపిరాడక కన్నుమూసింది. నవమాసాలు మోసిన కన్నతల్లే ఈ దారుణానికి పాల్పడటంతో అంతా విస్తుపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం (ఏప్రిల్ 9) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మేఘానీనగర్ ప్రాంతంలోని అంబికానగర్‌లో నివసించే కరిష్మా బాఘేల్ (22) మూడు నెలల కిందట బాబుకు జన్మనిచ్చింది. అయితే బాలుడు ఖయాల్‌ ఎందుకో తెలియదుగానీ పుట్టినప్పటి నుంచి నిరంతరం ఏడుస్తుండేవాడు. తల్లిగా బిడ్డ బాధను అర్ధం చేసుకుని తీర్చడానికి బదులు ఆమె పిల్లాడి ఏడ్పుతో విసిగిపోయింది. దీంతో ఏప్రిల్‌ 5న అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న నీటి సంపులో బాబును పడేసి ఏమీ తెలియనట్లు మూత పెట్టేసి చేతులు దులుపుకుంది. దీంతో బాలుడు ఊపిరాడక మృతి చెందాడు.

మూడు నెలల కుమారుడు ఖాయల్ కనిపించడం లేదని కరిష్మా నానా హడావుడి చేసింది. అనంతరం ఏమీ ఎరగనట్లు దొంగనాటకాలు ఆడసాగింది. ఆమె ఏడుపు చూడలేక భర్త దిలీప్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో అసలు సంగతి తేలడంతో చివరకు ఆ కరిష్మాను అరెస్ట్‌ చేశారు. స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో కరిష్మాను ప్రశ్నించగా పిల్లాడిని ఇంట్లో ఉంచి స్నానానికి వెళ్లానని, తిరిగొచ్చేటప్పటికీ మాయమైనట్లు తెల్పింది. దీంతో పోలీసులు మహిళ ఇంటి పరిసర ప్రాంతాల్లో గాలించగా.. సోమవారం (ఏప్రిల్ 7) అంబికానగర్ ప్రాంతంలోని వారి ఇంటి నీటి సంపులో శిశువు మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో సంపులో పడేసింది తల్లి కరిష్మానే అని తెలుసుకుని విస్తుపోయారు. దీంతో గత సోమవారం రాత్రి ఆమెను అరెస్టు చేశారు. ట్యాంక్ నిర్మాణం బట్టి చూస్తే ప్రమాదవశాత్తు శిశువు అక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యమని భావించిన పోలీసులు నిందితురాలు కరిష్మానే అని తేల్చారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.