స్ట్మార్ట్‌ గ్లాసెస్‌తో ఆలయంలోకి వస్తున్న భక్తుడు.. అనుమానం వచ్చి చెక్‌చేయగా..

సీక్రెట్‌ కెమెరాలు అమర్చిన స్మార్ట్‌ గ్లాసెస్‌తో ఆలయంలోకి వెళ్లిన ఓ యాత్రికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని గ్లాసెస్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా అందులో సీక్రెట్‌ కెమెరాస్‌ ఉన్నట్టు గుర్తించారు. రికార్డింగ్‌ పరికరాలను ఆలయంలోకి తీసుకురావద్దన్న ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

స్ట్మార్ట్‌ గ్లాసెస్‌తో ఆలయంలోకి వస్తున్న భక్తుడు.. అనుమానం వచ్చి చెక్‌చేయగా..
Kerala

Updated on: Jul 07, 2025 | 10:46 PM

కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి రహస్య కెమెరాలు అమర్చిన స్మార్ట్‌గ్లాసెస్ పెట్టుకొని ప్రవేశించడానికి ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన 66 ఏళ్ల యాత్రికుడిని ఆదివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా అనే వ్యక్తి తన భార్య, సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాడు. అయితే అతను సీక్రెట్‌ కెమెరాలతో అమర్చిన స్మార్ట్‌ గ్లాసెస్‌ను పెట్టుకొని ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అతను ఆలయం ద్వారం గుండా లోపలికి వస్తున్న క్రమంలో ఆయన పెట్టుకున్న గ్లాసెస్‌లో లైట్‌ రావడం భద్రతా సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమై అతన్ని అడ్డగించారు.

అతని పెట్టుకున్న గ్లాసెస్‌ను తీసుకొని పరిశీలించగా..వాటిలో రహస్య కెమెరాలు ఉన్నట్టు గుర్తించారు. యాత్రికుడు ఇలా సీక్రెట్‌ కెమెరాలు ధరించి ఆలయంలోకి రావడం.. రికార్డింగ్‌ పరికరాలను ఆలయంలోకి తీసుకురావడంపై ఆలయ అధికారులు విధించిన కఠినమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆలయ సిబ్బంది భావించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయ సిబ్బంది సమాచారంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సదురు యాత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా పోలీసు విచారణకు హాజరు కావాలని అతనికి నోటీసు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.