
అయోధ్య రామమందిరంపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. హర్యానా లోని ఫరీదాబాద్‌లో గుజరాత్ ఏటీఎస్,హర్యానా ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్‌లో అబ్దుల్ రెహ్మాన్ అనే ఉగ్రవాదిని అదుపు లోకి తీసుకున్నారు. 20 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్టు గుర్తించారు.
అబ్దుల్ రెహ్మాన్ దగ్గరి నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే నిర్వీర్యం చేశారు. అయోధ్య రామమందిరంపై దాడి చేయడానికి రెహ్మాన్‌ను ఐఎస్‌ఐ ఉసిగొల్పినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయోధ్య రామమందిరంపై అబ్దుల్ రెహ్మాన్ పలుమార్లు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. రామమందిరం సెక్యూరిటీ వివరాలను ఐఎస్‌ఐకి చెరవేసినట్టు కూడా గుర్తించారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తొలుత గుజరాత్ ఏటీఎస్ అప్రమత్తమయ్యింది. హర్యానా ఏటీఎస్ సహకారంతో ఈ కుట్రను గుట్టురట్టు చేశారు.
అబ్దుల్ రెహ్మాన్‌ను యూపీ లోని ఫైజాబాద్ నివాసిగా గుర్తించారు. ఫరీదాబాద్‌లో మారుపేరుతో అతడు నివసిస్తునట్టు దర్యాప్తులో తేలింది. అబ్దుల్ రెహ్మాన్ నెట్‌వర్క్‌ను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తరువాత అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అబ్దుల్ రెహ్మాన్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని వెల్లడించాడు. జమాత్ కార్యక్రమాల కోసం ఢిల్లీ, విశాఖ వెళ్లి కొద్దిరోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిపాడు. కాగా.. అబ్దుల్ రెహ్మాన్ జమాత్ కార్యక్రమాలను విధిగా హాజరైనట్టు కూడా గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..