
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గుజరాత్ ను మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 2,212 కోట్ల భారీ విలువైన మత్తుపదార్థాలను అధికారులు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా నాశనం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి సమక్షంలో మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ పదార్థాలు పట్టుబడ్డాయి. మొత్తం 14,500 కిలోల మత్తుపదార్థాలలో 11.1 లక్షల మద్యం సీసాలు ఉన్నాయి.. ఈ దాడులు స్వాధీనాలకు సంబంధించి మొత్తం 877 కేసులు నమోదు చేశారు.
శాస్త్రీయ పద్ధతిలో మత్తుపదార్థాల ధ్వంసం
భరూచ్ జిల్లాలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న భరూచ్ ఎన్విరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ BEILలో అత్యాధునిక డిస్ట్రాయర్ యంత్రంలో ఈ భారీ మొత్తంలోని డ్రగ్స్‌ను నిర్వీర్యం చేశారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న గుజరాత్ ప్రభుత్వం
గుజరాత్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. అయినప్పటికీ చాప కింద నీరులా సముద్ర మార్గాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి గుజరాత్ లోకి వస్తున్న డ్రగ్స్,మద్యం పై ఉక్కుపాదం మోపుతోంది గుజరాత్ క్రభుత్వం. డ్రగ్ కార్టెల్స్, సిండికేట్లు , పెడ్లర్ల భరతం పట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, యువతను మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు పలు సామాజిక సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.