దేశంలో కరోనా వైరస్ పాండమిక్ విషయంలో ప్రభుత్వం మితిమీరిన విశ్వాసంతో ఉందని, తగ్గిపోయిందన్న నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి రెండు కొత్త వేరియంట్లు మన దేశంలోకి ప్రవేశించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ మీడియాకు తెలిపినట్టు వచ్చిన వార్తలను ఆయన తన ట్విటర్ కు జోడించారు. బ్రెజిలియన్ వేరియంట్ కు సంబంధించి ఒక కేసు, సౌతాఫ్రికా వేరియంట్ కు సంబంధించి 4 కేసులు ఇండియాలో నమోదైనట్టు బలరాం భార్గవ వెల్లడించారు. ఆ దేశాల నుంచి ఇండియాకు చేరుకున్నవారికి మరిన్ని కరోనా వైరస్ టెస్టులు ముమ్మరంగా నిర్వహిస్తామన్నారు. అయిదుగురు వ్యక్తులను అప్పుడే క్వారంటైన్ కి పంపినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇండియాలో ప్రవేశించిన యూకే మ్యుటేషన్ వైరస్ కేసులు 187 నమోదయ్యాయి.. వీటి విషయమై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అని తెలిపింది.
కాగా దక్షిణాఫ్రికా, బ్రెజిలియన్ వేరియంట్ ఇన్ఫెక్షన్లు చాలా శీఘ్రంగా వ్యాప్తి చెందుతాయని ఈ వైరస్ సోకిన రోగులకు వ్యాక్సిన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే ఇది ఇంకా కచ్చితంగా నిరూపణ కావలసి ఉందని పేర్కొంది. ఈ వేరియంట్లు యూకే మ్యుటేషన్ కన్నా ఒక వ్యక్తి ఊపిరితిత్తులకు వేగంగా సంక్రమిస్తాయని అంటున్నారు. సౌతాఫ్రికాకు సీరం కంపెనీ 10 లక్షల డోసుల వ్యాక్సిన్ ని పంపినప్పటికీ ఆ దేశం వీటిని తిప్పి పంపివేసిన విషయం గమనార్హం. అటు-ఇండియాలో మంగళవారం కొత్తగా 11,610 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
GOI is being grossly negligent and over confident about Covid-19.
It’s not over yet. pic.twitter.com/W3FcSkS2JD
— Rahul Gandhi (@RahulGandhi) February 17, 2021