అన్నదాతలకు కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. రబీ పంటలకు కనీసం మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. రబీ సీజన్ లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ.400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం తెలిపింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజన్‌లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఆయా పంటలు సాగుచేసిన రైతులకు దిగుబడిపై గిట్టుబాటు ధర లభ్యతపై భరోసా ఇస్తూ 2022-23 మార్కెటింగ్ సీజన్‌కుగాను ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు నిరుటితో పోలిస్తే అత్యధికంగా పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంటల సాగులో వైవిధ్యం దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది కేంద్రం.
ముఖ్యంగా గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలు లపై కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం.. 2022 – 23 మార్కెటింగ్ సీజన్‌కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తింపచేయనుంది. గత సంవత్సరం కంటే MSP లో అత్యధిక పెరుగుదల కాయధాన్యాలు (మసూర్) , రేప్‌సీడ్‌లు, ఆవాలు పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 400 చొప్పున మద్దుతు ధర లభించనుంది. ఇక, క్వింటాల్ చెరకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక, పెరిగిన ధరలతో క్వింటాల్ గోధుమలకు రూ. 2015 మద్దతు ధర లభించనుంది. ఇక పెంచిన ధరలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కాస్త ఊరట లభించనుంది.
డిమాండ్-సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి, రైతుల్లో ఇతర పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, నూనె గింజలు, పప్పులు, ముతక తృణధాన్యాలకు అనుకూలంగా MSP లను పునర్వ్యవస్థీకరించడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ప్రకటించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్‌తో పాటు ఎంఎస్‌పి పెరుగుదల విస్తరణ, ఉత్పాదకతను విస్తరించడంలో సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది. అన్నదాతల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఉపాధిని కల్పించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సర్కార్ భావిస్తోంది.
Sasikala Property: అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు జప్తు