నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ ట్రాఫిక్ ఫైన్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో మరో సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశించారు. ఇక ఈ ఆదేశాలు సెప్టెంబర్ 4నే ఆయా శాఖలకు కూడా వెళ్లిపోయాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మీనూ చౌదరి హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా తీవ్రంగా పరిగణించి డబుల్ జరిమానాలు విధిస్తామని అన్నారు. రెండు సార్లు చలాన్లు విధించిన తర్వాత.. వాటిని చెల్లించకపోతే కోర్టుకు పంపిస్తామని తెలిపారు. 2018లో 250 మంది పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు వందమంది పోలీసులపై కేసులు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు రూల్స్ అతిక్రమించకుండా ఉండేలా ఇప్పటికే 626 మంది పోలీసులకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మీనూ చౌదరి స్పష్టం చేశారు.