Giriraj Singh Terror Threat: ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లోని పలువురు బీజేపీ నాయకులలో ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నివేదిక వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(Islamic State Khorasan) తన పత్రిక కొత్త ఎడిషన్‌లో బీజేపీ నేతలపై దాడుల చేయాలన్న పథకంపై రాసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ హిట్ లిస్ట్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద ముప్పు కారణంగా గిరిరాజ్ సింగ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు సూచించారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ పలు ముస్లిం సంస్థల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు ఆమెను తమ హిట్ లిస్ట్‌లో చేర్చినట్లు ఇంటెలిజన్స్ వర్గాలకు సమాచారం అందింది.
ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో బీజేపీ నాయకులు.. ముఖ్యంగా బీహార్‌కు చెందిన నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో బీహార్ రాష్ట్ర పోలీసులు, రైల్వే పోలీసుల అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత గిరిరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారని ఐబీ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన అతికొద్ది మంది బీజేపీ నేతలలో గిరిరాజ్ సింగ్ ఒకరు. తాజాగా ఆయన కుల గణనకు సంబంధించి ఓ కీలక ప్రకటన కూడా చేశారు. బీహార్‌లో ప్రతిపాదిత కుల గణనలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాల వంటి చొరబాటుదారులను మినహాయించాలని కోరారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగా చొరబాటుదారులు ఏళ్లుగా బీహార్‌లో నివసిస్తున్నారని అన్నారు. అటు వెనుకబడిన తరగతులకు దక్కాల్సిన రిజర్వేషన్లను ముస్లింలు హైజాక్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా జరిగిన ఘర్షణలపై కూడా గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామనవమి ఊరేగింపులపై అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. జిన్నా మనస్తత్వం కలిగిన వ్యక్తులు, ఓవైసీ తరహా వ్యక్తులు శ్రీరామ నవమి ఊరేగింపులపై అభ్యంతరాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఈ దేశంలో కాకపోతే ఎక్కడ శ్రీ రామనవమి ఊరేగింపులు జరపాలి? అంటూ ప్రశ్నించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి న్యాయం జరుగుతోందా? అని ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..