కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు గోమాత మహా పాదయాత్ర.. ఏమా కథ?

| Edited By: Janardhan Veluru

Oct 23, 2024 | 5:12 PM

ఇప్పటి వరకు చాలా యాత్రలు దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు సాగాయి. ఇప్పుడు గోమాత కాశ్మీర్‌లో యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్న గోమాత పాదయాత్ర మార్చి నెలాఖరు నాటికి కన్యాకుమారి చేరుకోనుంది. హిందూ జీవన విధానంలో ఎంతో ప్రాధాన్యత, ప్రాశస్త్యం కల్గిన 'గోవు'ను పరిరక్షించుకోవాలన్న సందేశంతో ఈ పాదయాత్ర సాగుతోంది.

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు గోమాత మహా పాదయాత్ర.. ఏమా కథ?
Gau Raksha Maha Padayatra
Follow us on

ధర్మ పరిరక్షణ, మత సామరస్యం కోసం అప్పుడెప్పుడో వేల ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని చదువుకున్నాం. ఆ తర్వాత కూడా ఎంతో మంది మహానుభావులు భారతదేశంలో విస్తృతంగా పర్యటించిన దాఖలాలున్నాయి. నేటి ఆధునిక సమాజంలో విమానయానం, రైలు మార్గాలు, శరవేగంగా ప్రయాణించడానికి అనువైన రహదారులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలాంటి సరైన రహదారి మార్గాలు లేని ఆ రోజుల్లో దట్టమైన అడవులు, నదులు, కొండలు, కోనలు దాటుకుంటూ కాలినడకన సాగించిన యాత్రలు అత్యంత సాహసోపేతమైనవి. ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు జరుగుతున్నాయి. కొందరు రాజకీయాల కోసం పాదయాత్రలు చేస్తుంటే, ధర్మం కోసం పాదయాత్రలు చేస్తున్నవారు సైతం మనకు తారసపడుతూ ఉంటారు. ఈమధ్య కాలంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు గోమాత ఈ సాహసం చేపట్టింది. ఇప్పటి వరకు జరిగిన యాత్రలు దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు సాగితే.. ఈ గోమాత కాశ్మీర్‌లో యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్న గోమాత మహా పాదయాత్ర మార్చి నెలాఖరు నాటికి కన్యాకుమారి చేరుకోనుంది. హిందూ జీవన విధానంలో ఎంతో ప్రాధాన్యత, ప్రాశస్త్యం కల్గిన ‘గోవు’ను పరిరక్షించుకోవాలన్న సందేశంతో సాగుతున్న ఈ పాదయాత్రను అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన పలువురు అగ్రనేతలు ప్రశంసిస్తున్నారు.

Gau Raksha Maha Padayatra

14 రాష్ట్రాలు, 4,900 కిలోమీటర్లు

గోవు భారతీయ జీవన విధానంలో.. మరీ ముఖ్యంగా హిందూ మతంలో పవిత్రమైన పెంపుడు జంతువు. గోవు ఇచ్చే పాలు మాత్రమే కాదు, గోమూత్రం, పేడ కూడా వ్యవసాయ అవసరాలకు, కొన్ని సందర్భాల్లో వైద్య అవసరాలకు వినియోగించేవారు. అధునాతన యంత్ర పరికరాలు, రసాయన ఎరువులు వచ్చిన తర్వాత గోవులను కేవలం పాలిచ్చే జంతువులుగా మాత్రమే వినియోగిస్తున్నారు. గోవులను ఆహారంగా వినియోగించేవారికి విక్రయించేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటూ అనేక హిందూ ధార్మిక సంస్థలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో గోహత్యను నిషేధించగా, అక్రమంగా కబేళాలకు తరలించడంపై కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక చర్చను లేవనెత్తుతూ.. గోరక్షణతోనే భూరక్షణ సాధ్యమంటూ ఓ సంస్థ గోవుతో పాటు పాదయాత్ర చేపట్టింది.

Gau Raksha Maha Padayatra

అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన ఈ పాదయాత్ర మొత్తం 14 రాష్ట్రాల మీదుగా 4,900 కి.మీ మేర సాగి చివరకు కన్యాకుమారిలో ముగియనుంది. సెప్టెంబర్ 27న కాశ్మీర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఈ యాత్ర గురించి తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పాదయాత్ర చేస్తున్న బృందాన్ని ఆవుతో పాటుగా కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.