సెప్టెంబర్ 2021లో రోహిణి కోర్టు షూటౌట్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియా మంగళవారం జైలులో మృతి చెందాడు. ఢిల్లీలోని తీహార్ జైలులో జరిగిన దాడిలో టిల్లూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ టిల్లూను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ దాడిలో రోహిత్ అనే మరో ఖైదీ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
ఢిల్లీలోని తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యోగేష్ తుండా, అతని అనుచరులు తజ్‌పూరియాపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. తుండా జితేందర్ గోగి గ్యాంగ్‌కు చెందిన వాడిగా తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టిల్లు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలీసులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘర్షణలో గాయపడిన మరో ఖౌదీ రోహిత్‌ను చికిత్స అందించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ అక్షత్ కౌశల్ వెల్లడించారు.
కాగా సునీల్ సునీల్ మాన్ అలియాస్ టిల్లు తాజ్‌పురియా ఢిల్లీలోని ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. రోహిణి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 24, 2021న ఇద్దరు టిల్లు అనుచరులు లాయర్ వేషధారణలో వచ్చి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిను కాల్చిచంపారు. ఈ ఘటనలో గోగి అక్కడికక్కడే మృతి చెందగా.. నిందితులిద్దరినీ పోలీసులు కాల్చి చంపారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. అప్పటికే మరో కేసులో జైలులోఉన్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్‌పూరియా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. గోగి, తాజ్‌పురియా గ్యాంగ్‌ల మధ్య దాదాపు దశాబ్ద కాలంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో రెండు డజన్ల మందికి పైగా మరణించారు. రెండు ముఠాల సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ క్రమంలో జైల్లో టిల్లుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, దోపిడీలు మరియు కార్‌జాకింగ్ కేసులలో చిక్కుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.