Sharad Yadav: మీ జీవితం స్ఫూర్తివంతం.. శరత్ యాదవ్‌ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోడీ సహా పలువురు నేతలు

|

Jan 13, 2023 | 10:22 AM

‘శరద్‌యాదవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం అన్నారు ప్రధాని. ప్రజాజీవితంలో సుధీర్ఘ కాలంపాటు మంత్రిగా, ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. డా.లోహియా ఆలోచనలతో ఎంతో స్ఫూర్తివంతంగా నిలిచారని.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ.

Sharad Yadav: మీ జీవితం స్ఫూర్తివంతం.. శరత్ యాదవ్‌ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోడీ సహా పలువురు నేతలు
Sharad Yadav Passed Away
Follow us on

కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్‌ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ కన్నుమూశారు. నిన్న గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కూతురు సుభాషిణి యాదవ్‌ ప్రకటించారు. సీనియర్‌ నేషనల్‌ పొలిటీషయన్‌ శరద్‌ యాదవ్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్‌ యాదవ్‌ నిన్న తీవ్ర అస్వస్థతకు గురియ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన. ‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మార స్థితిలో ఉన్నారు. పల్స్‌ లేదు. తొలుత సీపీఆర్‌ ప్రయత్నించి చూశారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని.. ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్‌ యాదవ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో జబల్‌పూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అప్పటి రాజకీయాల్లో సంచలన నేతగా పేరున్న జయప్రకాశ్ నారాయణ్ 27 ఏళ్ల యువకుడైన శరద్ యాదవ్‌కి సూచించారు. జయప్రకాశ్ నారాయణ్ అప్పగించిన ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన శరద్ యాదవ్‌.. ఆ ఎన్నికల్లో గెలుపొంది తొలి పోటీలోనే విజయం అందుకున్నారు. అది మొదలు శరద్ యాదవ్‌ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు వరించాయి.

1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌ జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగని శరద్‌ యాదవ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

శరద్‌ యాదవ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌చేశారు. ‘శరద్‌యాదవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం అన్నారు ప్రధాని. ప్రజాజీవితంలో సుధీర్ఘ కాలంపాటు మంత్రిగా, ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. డా.లోహియా ఆలోచనలతో ఎంతో స్ఫూర్తివంతంగా నిలిచారని.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ.

కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్ యాదవ్ అందించిన మద్దతు ను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

అంతేకాదు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) మాజీ అధ్యక్షులు శరద్ యాదవ్ మరణం రాజకీయాల్లో తీరని లోటు అని అన్నారు. ఆయన మృతికి ఎంపీ బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పలుమార్లు లోక్ సభ, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా శరద్ యాదవ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. శరద్ యాదవ్ కుటుంబ సభ్యులకు బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లికే చేయండి..