#Lock-down లాక్ డౌన్ అనంతర పరిస్థితిపై మోదీ ఫోకస్.. ఏకంగా 11 కమిటీలు

|

Mar 30, 2020 | 6:53 PM

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ఉద్దేశించిన కఠోర లాక్ డౌన్ పీరియడ్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

#Lock-down లాక్ డౌన్ అనంతర పరిస్థితిపై మోదీ ఫోకస్.. ఏకంగా 11 కమిటీలు
Follow us on

Prime Minister Modi focusing on Lack-down: కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ఉద్దేశించిన కఠోర లాక్ డౌన్ పీరియడ్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఒకవైపు లాక్ డౌన్‌ని మరింత పొడిస్తారన్న వదంతులను కేంద్రం కొట్టి పారేసిన దరిమిలా లాక్ డౌన్ పీరియడ్‌తో దెబ్బతిన్న అంశాలను వీలైనంత త్వరగా గాడిలో పెట్టేందుకు ప్రధాని సిద్దమవుతుండడం కొంతలో కొంత ఊరట నిచ్చే అంశం.

దేశం యావత్తు పూర్తి లాక్ డౌన్లోకి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు అన్ని రంగాలు కుదేలైపోయాయి. సామాన్యుని దగ్గర నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు, నిరుపేద కుటుంబాల నుంచి సెలెబ్రిటీల జీవితాల దాకా పూర్తిగా స్థంభించిపోయిన పరిస్థితి. సంపన్నులంతా ఇంట్లో వున్న నిండైన ఖజానాతోను, నిండుగా వున్న నిత్యావసరాలతోను గడుపుతూనే కేవలం ఇంటికే పరిమితమైనందుకు విలవిలలాడుతున్నారు. ఏమీ లేని నిరుపేద ఓ వైపు కడుపులు మాడిపోతున్నా.. పని చేసుకునే సత్తా వున్నా ఏమీ చేయలేకి కాలే కడుపులతో కేవలం ఇంటికే పరిమితమైన దుస్థితి.

ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా.. లేక లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రజల వైఖరి కారణంగా లాక్ డౌన్‌ను పొడిగించాల్సి వస్తుందా అన్న చర్చలు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని కేంద్రం సోమవారం ఉదయం స్పష్టం చేసింది. అదే క్రమంలో లాక్ డౌన్ ముగిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి దృష్టి సారించారు.

ఆర్థిక, వైద్య ఆరోగ్యరంగాలు సహా మొత్తం పదకొండు అంశాలలో తక్షణం తీసుకోవాల్సిన పరిస్థితులను అధ్యయనం చేసి, సరైన సిఫారసులను చేసేందుకు ఏకంగా పదకొండు కమిటీలను మోదీ నియమించారు. వాటన్నింటికీ ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పీ.కే.మిశ్రా సారథ్యం వహిస్తారు. ఈ పదకొండు కమిటీలలో తొమ్మిదింటికి కార్యదర్శి స్థాయి అధికారి సారథ్యం వహిస్తుండగా.. ఒకదానికి నీతి ఆయోగ్ సభ్యుడు, మరొక దానికి నీతి ఆయోగ్ సీఈవో సారథ్యం వహిస్తారు. దేశం యావత్తు సడన్‌గా పాండామిక్ థ్రెట్‌లోకి వెళ్ళడంతో ఫ్యూచర్‌లో ఇలాంటి పరిణామాలు తలెత్తితే.. ఎదుర్కోవడానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విషయంపై ఓ కమిటీని ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా అన్ని రంగాల్లో నార్మల్సీ తేవడానికి తగిన చర్యలను సిఫారసు చేయడంమే మిగిలిన 10 కమిటీలకు నిర్దేశించిన ఎజెండాగా తెలుస్తోంది. ఏప్రిల్ రెండోవారం ప్రారంభానికి ఈ కమిటీలు నివేదికలు ఇస్తే వాటిపై కేంద్ర కేబినెట్ చర్చించి తగిన నిర్ణయాలతో ఏప్రిల్ 14వ తేదీ నాటికి సర్వసన్నద్దంగా వుండాలని ప్రధాన మంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.