Wrestlers Protest: “నేను అమాయకుడ్ని”.. మహిళా రెజ్లర్ల ఆరోపణలపై స్పందించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్

|

Apr 29, 2023 | 12:07 PM

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగాట్‌తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు జంతర్‌మంత్‌ వద్ద గత ఏడురోజులుగా ఆందోళన చేస్తున్నారు.

Wrestlers Protest: నేను అమాయకుడ్ని.. మహిళా రెజ్లర్ల ఆరోపణలపై స్పందించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్
Bjp Mp Brij Bhushan Singh
Follow us on

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగాట్‌తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు జంతర్‌మంత్‌ వద్ద గత ఏడురోజులుగా ఆందోళన చేస్తున్నారు. బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా బ్రిజ్ భూషన్ స్పందించారు. తాను అమయకుడినని.. విచారణకు సహకరించేందుకు సిద్ధమేనని తెలిపారు. న్యాయవ్యవస్థపైన తనకు నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. అయితే తనపై మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అలాగే ఆయన రాజీనామ చేస్తున్నారనే పుకార్లపై కూడా స్పందించారు. తాను నేరస్థుడ్ని కాదని.. రాజీనామ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ రాజీనామ చేస్తే వాళ్లు చేస్తున్న ఆరోపణలను ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. తన పదవి కాలం దాదాపు ముగిసిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని..45 రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఆ ఎన్నికల తర్వాత తన పదవికాలం ముగుస్తుందని స్పష్టం చేశారు.

రెజ్లర్లు ప్రతిరోజూ కొత్త కొత్త డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. మొదటగా వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అది రిజిస్టర్ అయ్యాక.. మళ్లీ ఇప్పుడు తనని జైలుకు పంపించాలని.. తనకున్న పదవుల రాజీనామ చేయాలని కోరుతున్నారని ఆరోపించారు. తన ప్రజల వల్లే తన నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నానని.. వినేష్ ఫోగాట్ వల్ల కాదన్నారు. తనపై పెట్టిన కేసులో సుప్రీం కోర్టు, ఢిల్లీ పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తానని తెలిపారు. గత 12 ఏళ్లుగా రెజ్లర్లు పోలీస్ స్టేషన్‌లోగాని, క్రీడల మంత్రిత్వశాఖకు గాని ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని పేర్కొన్నారు. వాళ్లు నిరసనలు చేసే ముందు తనని ప్రశంసించేవారని, వారి పెళ్లిల్లకి ఆహ్వానించి తన ఆశీర్వాదం తీసుకునేవారని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసుల చేతిలో ఉన్నందున వాళ్ల తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తానన్నారు. అలాగే రెజ్లర్ల నిరసన వెనక కొంతమంది పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని.. అసలు ఈ నిరసన ముఖ్యంగా రెజ్లర్ల కోసం జరగడం లేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..