Farmers’ protest : కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు అన్నదాతలు. రైతులు చేపట్టిన ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కల మూడు మార్గాల్లో పోలీసులు అనుమతించగా, పలు చోట్ల రైతుల ట్రాక్టర్లు ముందుకు కదలకుండా పోలీసులు బారికేడ్లను ఉంచడంతో, రైతులు తొలగించి మరీ ర్యాలీని ముందుకు సాగించారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ జెండాలు పట్టుకుని వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాలని రైతులు నినాదాలు చేశారు. సింఘు టిక్రీ సరిహద్దుల్లో పోలీసుల బ్యారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఢిల్లీలోని ఐటీఓ సమీపంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన బస్సులను ధ్వంసం చేసే ప్రయత్నం చేసారు రైతులు. కాగా రైతులు ట్రాక్టర్లతో రోడ్లకు అడ్డంగా ఉన్న ట్రక్కులను తొలగించడానికి ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు రైతుల ట్రాక్టర్ టైర్ల గాలిని పోలీసులు తీసేసారు. దాంతో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వైపులా 10 మందికి పైగా గాయాలు అయ్యాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :