Union Minister Narendra Singh Tomar: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాల విషయం సుప్రీం కోర్టులో ఉన్నందున ప్రస్తుతం వాటిని అమలు చేయలేకపోతున్నామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం తోమర్ మీడియాతో మాట్లాడారు. రైతులతో ఇప్పటివరకు 12సార్లు చర్చలు జరిగాయని.. ఇప్పటికీ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికి రైతు సంఘాలతో 12 రౌండ్ల చర్చలు జరిగాయని గుర్తుచేశారు. నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయం సుప్రీంలో ఉన్నందున ప్రస్తుతం అమలు చేయలేమని తెలిపారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇప్పటి వరకూ తన అభిప్రాయాలను సమర్పించలేదని.. ఇంకా అభిప్రాయాల సేకరణ జరుగుతుందని తెలిపారు. తాము ప్రతిపాదించిన వాటికి రైతు సంఘాలు ఒప్పుకుంటే.. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ ఇటీవల కూడా కేంద్ర మంత్రి తోమర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా.. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు జరిగిన 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో చట్టాలను రద్దు చేసి, పంటలకు కనీస మద్దుతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలకు మాత్రమే తాము సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. దీంతో ప్రతీసారి జరిగిన చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి.
ఇదిలాఉంటే.. ఉద్యమం జరుగుతున్న సమయంలో అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు బుధవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రైతు ఉద్యమ సమయంలో అరెస్టు చేసి జైలుకు పంపిన అమాయక రైతులను, మద్దతుదారులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. దీంతోపాటు వారిపై పెట్టిన తప్పుడు కేసులను.. ఇప్పటికే పంపించిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.
Also Read: