కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు చేపట్టిన నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. అటు ఈనెల 14న సింఘు సరిహద్దులో నిరహార దీక్షలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. అటు కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వెనకకు తీసుకోకపోతే.. తమ నిరసనలు ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 19లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేకుంటే అదే రోజు నుంచి రైతులందరూ ఆమరణ నిరహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. కాగా ఈరోజు ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం తాము కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అటు రైతులకు మద్ధతుగా తమ తల్లులు, అక్కాచెల్లెల్లు, బిడ్డలు సైతం ఈ పోరాటంలో పాల్గొనడానికి సిద్ధాంగా ఉన్నారని.. ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివస్తు్న్నారని పేర్కోన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన తమ నిరసనలు మాత్రం ఆగవని తేల్చి చెప్పారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానితోపాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.