BKU Leader Rakesh Tikait: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకూ తాము ఇళ్లకు వెళ్లమని బీకేయూ నాయకుడు రాకేష్ తికాయిత్ మరోసారి స్పష్టంచేశారు. అవసరమైతే రైతులు పంటలు త్యాగం చేసేందుకు సిద్ధం కావాలంటూ ఆయన సూచించారు. పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. ఇలాంటి ధోరణి తగదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చేతికి వచ్చిన పంటలను కూడా త్యాగం చేసేందుకు రైతులు సిద్ధమవ్వాలన్నారు. హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలోని ఖరక్ పూనియా గ్రామంలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో తికాయత్ మాట్లడారు. రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదని పేర్కొన్నారు. ఓవైపు పంటలను సాగుచేయడంతో పాటు మరోవైపు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
ఒకవేళ చేతికి వచ్చిన పంటను తగులబెట్టాల్సి వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే ప్రణాళికలో భాగంగా వ్యవసాయ సంఘాలు ఇచ్చే తదుపరి కార్యాచరణకు రైతులు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లను నిర్వహిస్తామని తికాయిత్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమంగా ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: