ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టును సైబర్ సెల్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు 500 మందికి పైగా వ్యక్తులను చీట్ చేసి రూ. 2.5 కోట్లను వెనకేసుకున్నారట. తమను ఫారినర్లుగా చెప్పుకుంటూ ఫేక్ సిమ్ కార్డులను ఉపయోగించి.. వీరు సాగించిన దందా బయట పడింది. ఈ గ్యాంగ్ లోని ఏడుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు బీఏ చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. పేరు పొందిన కంపెనీల నుంచి తక్కు వ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ ఈ ఘరానా కేటుగాళ్లు అనేకమందిని బుట్టలో వేసుకున్నారని, రుణం కోసం మీరు కొంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులో డిపాజిట్ చేయాలని వీరు నేర్పుగా మోసగించారట.. బాధితులు వారు చెప్పిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయగానే ఇక వీరు తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో, సిమ్ కార్డు మార్చడమో చేసి తప్పించుకుంటూ వచ్చారని ఖాకీలు చెప్పారు. రుణం కోసం ఓ వ్యక్తి వీరిని సంప్రదించా డని, అయితే అనుమానం వఛ్చి వారు పేర్కొన్నకంపెనీని కాంటాక్ట్ చేయగా తాము ఆన్ లైన్ ద్వారా గానీ, ఇతరత్రా గానీ ఎలాంటి రుణాలు మంజూరు చేయడంలేదని ఆ సంస్థ తెలిపిందని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ ముఠా మోసాన్ని ఆయన ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో ఈ చీటర్ల మోసం బయటపడింది.