ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు లేదని తేలుస్తున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ మీడియా ఛానళ్ళతోపాటు కొన్ని ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేలను వెల్లడించాయి. తొట్టతొలిగా పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను మీడియాకు విడుదల చేసింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతుందని పీపుల్స్ పల్స్ సంస్థ తేల్చింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 54 నుంచి 59 స్థానాలను గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సంస్థ తేల్చింది. రెండో స్థానానికి పరిమితమైన భారతీయ జనతాపార్టీకి కేవలం 9 నుంచి 15 సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవడం కష్టమని ఈ సంస్థ సర్వే నివేదిక తెలుపుతోంది. ఓటింగ్ శాతాల్లోను మూడు ప్రధాన పార్టీల మధ్య గణనీయమైన అంతరం కనిపిస్తోందని తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 47.8 శాతానికి పైగా ఓట్లు సాధిస్తుండగా.. బీజేపీ 36.9 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ కేవలం 3 శాతం ఓట్లను సాధించబోతోందని పీపుల్స్ పల్స్ సర్వే నివేదికలో తెలిపింది. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి మొగ్గు చూపుతారన్న ప్రశ్నకు అరవింద్ కేజ్రీవాల్‌కు బంపర్ ఓట్లు పడ్డాయి.
ఏకంగా 77.6 శాతం మంది ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ బెస్ట్ సీఎం అని తేల్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్ళిన బీజేపీకి శరాఘాతం తగిలినట్లే భావించాల్సి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది. బీజేపీ నేత హర్షవర్దన్ పేరును 10.9 శాతం మంది, మరో బీజేపీ నేత మనోజ్ తివారీ పేరును 5.8 శాతం మంది ప్రస్తావించారు.