వలపు వలలో చిక్కుకుపోయిన రక్షణ శాఖకు చెందిన ఓ మాజీ ఉద్యోగి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ మహిళా ఏజెంట్‌కు చేరవేశాడు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం..
బీహార్ రాష్ట్రానికి చెందిన ముజఫర్‌పుర్ జిల్లా కాట్రా రిజిస్ట్రార్ కార్యాలయంలో రవి చౌరాసియా అనే వ్యక్తి క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అతడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్‌గా పనిచేసేవాడు. ఐతే పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మహిళా ఏజెంట్ ఫేస్‌బుక్ ద్వారా రవితో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా అతనితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. సదరు మహిళ మాయమాటలకు పూర్తిగాలొంగిపోయిన రవి, ఆమె అడిగిన రహస్య సమాచారాన్ని గూఢచారులకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఫోన్ కాల్స్ డేటా, ఈ-మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించి, నేరానికి పాల్పడినట్లుగా నిర్ధరణకు వచ్చారు. వీటి ఆధారంగా.. నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ ఆదేశాల మేరకు అతడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి, రవిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జయంత్ కాంత్ మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.