చెన్నైలో అక్రమంగా ఏనుగు దంతాలను విక్రయించే వారిని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్, చెన్నై అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.7.19 కోట్ల విలువైన 4 కేజీలు ఉన్న రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే డీఆర్ఐ, చైన్నై అధికారులకు రహస్యంగా ఏనుగు దంతాలను విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సెంట్రల్, టీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలను తరలించారు. అక్కడ కాపు కాసిన ఈ బృందాలు టీ నగర్‌లో ఓ చోట ఏనుగు దంతాలు విక్రయించే ప్రయత్నం చేయడాన్ని గుర్తించారు. వెంటనే ఏడుగురిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వీళ్ల నుంచి ఓ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
వన్య ప్రాణుల రక్షణ చట్టం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం-2023 ప్రకారం తొలి కేసు నమోదు చేశారు. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వన్యప్రాణుల రక్షణ చట్టం తాజా సవరణ మేరకు.. నిషేధ వస్తువులను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. దీంతో ఈ చట్టం ప్రకారమే చెన్నై డీఆర్‌ఐ అధికారులు తొలి కేసును నమోదు చేశారు. అనంతరం పట్టుబడ్డ ఏడుగురిని, ఏనుగు దంతాలు, వాహనాన్ని తమిళనాడు చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి