
డిజిటల్ ప్రపంచంలో ఏఐ వీడియోల ఉపయోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఏది నిజమో.. ఏది ఏఐ వీడియోను గుర్తు పట్టలేనంతగా అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏఐ వీడియోల ప్రభావం మన దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ప్రధానంగా రాజకీయ పరంగా ఈ ఏఐ వీడియోలను ఆయా పార్టీల నేతలు తమ స్వార్థం కోసం వినియోగిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏఐ వీడియోల వినియోగం పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది
బీహార్ ఎన్నికల్లో ఏఐ జోరు..
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) వీడియోలను రాజకీయ పార్టీలు జోరుగా వినియోగిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏఐ ద్వారా తమ ప్రచారాలు జనంలోకి వెళ్లేలా చూస్తున్నాయి. బీహార్ లోని రాజకీయ పార్టీలు ఇదివరకెన్నడూ ఉపయోగించని స్థాయిలో ఈ ఏఐపై ఆధారపడుతన్నాయి. ఇందులో అవాస్తవ రీల్స్.. అవమానకరమైన, అవాస్తవికమైన వీడియోలు క్రియేట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. ఒక పార్టీ మరో పార్టీపై బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈక్రమంలోనే అప్రమత్తమై ఎన్నికల సంఘం ఏఐ వీడియోల ఉపయోగంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ వీడియోల కోసం కృత్రిమ మేధస్సు ఉపయోగించడంపై మోడల్ ప్రవర్తనా నియమావళి, సంబంధిత మార్గదర్శకాలను పాటించాలని ఈసీఐ ఆదేశించింది.
సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై సమాచారాన్ని వక్రీకరించే, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ఫేక్ వీడియోలను సృష్టించడానికి కృత్రిమ మేథస్సు ఆధారిత పరికరాలను దుర్వినియోగం చేయవద్దని ఎన్నికల కమిషన్ సూచించింది. అన్ని రాజకీయ పార్టీలు, సదరు నాయకులు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో స్పష్టమైన సంకేతాలు ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఇందులో ముఖ్యంగా అనౌన్స్ రూపంలో ఆల్-జనరేటెడ్, సింథటిక్ కంటెంట్ ప్రముఖంగా లేబుల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా చూసుకోవడానికి సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచామని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..